మొంథా తుఫాన్ బాధితుల వద్దకు జగన్..! కృష్ణా జిల్లాలో టూర్ ఫిక్స్..!
ఏపీలో మొంథా తుపాన్ రేపిన కలకలం నుంచి ఇప్పటికీ చాలా వర్గాలు కోలుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ తుపాన్ సృష్టించిన విధ్వంసంతో రైతులు, మత్సకారులు, ఇలా చాలా వర్గాలు నష్టపోయాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు, అధికారులు నివేదికలు తయారు చేసి కేంద్ర సాయానికి పంపారు. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు.
ఈనెల 4న మంగళవారం మోంథా తుపాను బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. తుపాను కారణంగా తీవ్రంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావంగా జగన్ ఈ టూర్ కు వెళ్తున్నారు.పెడన, మచిలీపట్నంలో రైతులను పరామర్శించడంతో పాటు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. జగన్ టూర్ వివరాలను పార్టీ నేతలు పేర్ని నాని, తలశిల రఘురాం వెల్లడించారు.

మోంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, గాలులకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని, పంట నష్టం కారణంగా రైతులు కుదేలైపోయారని వైసీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన, రైతుకు అండగా నిలిచిన అనేక కార్యక్రమాలు, పథకాలను రద్దు చేసిందన్నారు. ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలను చేకూర్చారన్నారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడచిన 18 నెలల్లో 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల రూపంలో రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదన్నారు. దాదాపు రూ.600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని పెండింగ్ లో పెట్టారని, ఆర్బీకేలను, ఈ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

మరోవైపు మొంథా తుపాన్ నష్టంపైనా, రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గానీ, కార్యాచరణ గానీ ప్రభుత్వం వెల్లడించలేదని, ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా, సంఘీభావంగా జగన్ పర్యటించనున్నట్లు వారు తెలిపారు. రైతుల తరఫున వారి గొంతును గట్టిగా వినిపించనున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి తద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు పేర్ని నాని, తలశిల రఘురాం తెలిపారు.












Click it and Unblock the Notifications