బాలినేనికి జగన్ కౌంటర్ -24 గంటల్లోనే రెండు కీలక నియామకాలు..!
నేతల పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. అందులోనూ తనకు బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోయిన నేపథ్యంలో క్యాడర్ కు తప్పడు సంకేతాలు వెళ్లకుండా జగన్ అలర్ట్ అయ్యారు. బాలినేనికి ఝలక్ ఇస్తూ ఇవాళ రెండు కీలక నియామకాలు చేపట్టారు.
ఇన్నాళ్లూ ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గతంలో ఒంగోలు ఎంపీ, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాల కారణంగా పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జగన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బూచేపల్లికి సైతం జగన్ కు విధేయుడిగా పేరుంది. తద్వారా బాలినేనికి జగన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.

మరోవైపు ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడిగా పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డిని అక్కడే పరిశీలకుడిగా నియమించడం ద్వారా ప్రకాశం జిల్లాపై వైసీపీ పట్టు కొనసాగించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రకాశం జిల్లాలో సైతం వైసీపీ హవా తగ్గుతూ వస్తోంది. దీంతో జగన్ రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications