చంద్రబాబుకు జగన్ అల్టిమేటం- ఇక సమరమే..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. ఏపీ ప్రభుత్వం రైతులను ముంచేస్తుందని తీవ్ర ఆరోపణలు చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కనీస ధరలు లేక మిర్చి రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మిర్చి రైతులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు స్పందించకపోతే ఉద్యమం తప్పదని జగన్ హెచ్చరించారు.
మిర్చి యార్డులో జగన్
మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డు సందర్శించారు. రైతులను పరామర్శించారు. మిర్చి ధర పడిపోవటం పైన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండటంతో జగన్ పర్యటన పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, తాము రాజకీయ సభలు నిర్వహించ టం లేదని.. తాము ఎన్నికల్లో పొటీ చేయటం లేదని చెప్పిన వైసీపీ నేతలు, అసలు రైతుల పరామర్శకు కోడ్ ప్రస్తావన లేదని వివరిస్తున్నారు. అయితే, జగన్ పర్యటన సమయంలో భద్రతా పరంగానూ చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. కోడ్ పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పు బట్టారు.

రైతులకు పరామర్శ
జగన్ పర్యటన వేళ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రైతులను పరామర్శించిన జగన్ వారు ఎంతకు సరుకు అమ్ముకుంటారనే అంశం పైన ఆరా తీసారు. వారి స్వగ్రామాల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఏ పంటకు కనీసం మద్దతు ధర లేదని, మిర్చి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో అత్యధిక మద్దతు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకున్నామని చెప్పారు. ఇప్పుడు రైతు సమస్యలపై మాట్లాడటానికి వస్తుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అండగా నిలుస్తాం
కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. తన హయాంలో రైతుల కోసం ప్రతీ గ్రామ సచివాలయంలో ఆర్బీకే ల ద్వారా అందించిన సేవలను గుర్తు చేసారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రైతులకు కావాల్సిన విధంగా సాయం చేసామని వివరించారు. అమరావతి లో ఉన్న చంద్రబాబుకు సమీపంలోనే గుంటూరు మిర్చి యార్డులో కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించటానికి సమయం దొరకలేదని ధ్వజమెత్తారు. సచివాలయానికి - మిర్చి యార్డుకు ఎంత దూరం ఉందని పరామర్శకు రాలేదని నిలదీసారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేసారు. రైతుల సమస్యల పై స్పందించక పోతే ఉద్యమం తప్పదని జగన్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications