తొలిసారి ఎమ్మెల్యేవి, అనలేదు: సభలో జగన్Xబాబు
హైదరాబాద్: రాజధాని పైన ఏపీ సీఎం చంద్రబాబు గురువారం శాసన సభలో ప్రకటన చేశారు. రాజధాని కోసం తాము అన్ని కోణాల్లో చర్చ, కసరత్తు చేశామన్నారు. అన్ని విధాలా ఆలోచించే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భూసేకరణ కోసం కమిటీని వేశామని చెప్పారు. భూసేకరణ విధివిధానాల పైన సబ్ కమిటీ వేశామన్నారు. శివరామకృష్ణన్ నివేదిక ప్రజాభిప్రాయాన్ని బలపరిచిందన్నారు. ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తామన్నారు.
నాడు విజయవాడలో కమ్యూనిస్టుల బలంగా ఉండటం వల్లే కర్నూలు రాజధాని అయిందన్నారు. ప్రకాశం పంతులు సూచన మేరకు కర్నూలును రాజధాని చేశారన్నారు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, ప్రజలు ఆ పార్టీని అంతగా చిత్తుగా ఓడించాలని బాబు అన్నారు. విభజనలో ఏపీకి అన్యాయం జరిగిన కసిని ప్రజలు కాంగ్రెసును చిత్తుగా ఓడించడం ద్వారా చూపించారన్నారు.
హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా

నాడు హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాదుకు నాడు చిన్న విమానాశ్రయం మాత్రమే ఉందన్నారు. తాను సమైక్య ఏపీ సీఎంగా ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లి పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ రమ్మంటే వారు హైదరాబాదులో ఏమున్నాయని ప్రశ్నించారని, అలాంటి హైదరాబాదును తాను అభివృద్ధి చేశానని చెప్పారు.
తిరుపతిలో పెట్టాలని నాకుంది
ఈ సభలో ప్రతి ఒక్కరు తమ తమ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని, తనకు కూడా తిరుపతిలో పెట్టాలని ఉందని అన్నారు.
జగన్, చంద్రబాబు వాగ్వాదం
ఈ సమయంలో జగన్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు కూడా ఇడుపులపాయలో, పులివెందులలో రాజధానిని పెట్టాలని కోరలేదని జగన్ అన్నారు. అబద్దాలు చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు.
దీనికి చంద్రబాబు.. జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి ఎవరు పెట్టారని ప్రశ్నించారు.
దీనిపై జగన్ మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ ఎలా వచ్చిందో కూడా చంద్రబాబుకు తెలియదని ఎద్దేవా చేశారు. గ్రామీణ విద్యార్థుల కోసం ఈ సంస్థను వైయస్ నాడు తీసుకు వచ్చారని చెప్పారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ తీరు తాతకు దగ్గులు నేర్పినట్లుగా ఉందన్నారు. ట్రిపుల్ ఐటి పెట్టింది తానే అన్నారు. తాను హైదరాబాదులో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని గుర్తు చేశారు. జగన్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారని, ఆయన ఇంకా పద్ధతి నేర్చుకోవాలని కౌంటర్ ఇచ్చారు. తనకు జగన్ కంటే ఎక్కువ సమాచారం తెలుసునని, ఆయన నేర్చుకోవాలన్నారు. బాసర, నూజివీడు, ఇడుపులపాయలలో ట్రిపుల్ ఐటిలు పెట్టి హెడ్ ఆఫీస్ ఇడుపులపాయలో పెట్టారని, అయినా హైదరాబాదులోనే ఉందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications