పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్- అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు..
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ సీఎం జగన్ ఇవాళ సుదీర్ఘ విరామం తర్వాత పరిశీలించారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి వెళ్లిన జగన్ నేరుగా.. ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. కొంతకాలంగా నిలిచిపోయిన పోలవరం నిర్మాణానికి తిరిగి నిధులు కేటాయించేందుకు కేంద్రం ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పనుల్ని జగన్ సమీక్షించారు.
పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్ధితిని సమీక్షించిన సీఎం వైఎస్ జగన్ అనంతరం ప్రాజెక్టు సైట్ లోనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. అనంతరంవారికి కీలక సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసేలా శ్రమించాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని పూర్తిస్ధాయిలో రాబట్టుకోవడంతో పాటు వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు.

డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ కోరారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష చేశారు. పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు సీఎంకు తెలిపారు. షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్నారు. పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నిర్వాసితులకు పరిహారం విషయంలో తాజాగా ఢిల్లీలో జరిగిన కేంద్ర జల్ శక్తి శాఖ భేటీలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలవరానికి రూ.12811 కోట్ల నిధులు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదముద్ర కూడా పడితే నిధులు విడుదల అవుతాయి. అలాగే పరిహారం విషయంలోనూ కేంద్రం సూచించిన ఎత్తు వరకూ కడితే నిధులు ఇచ్చేందుకు సరేనంది. దీంతో రాష్ట్రం కూడా ఇప్పుడు తాజా పరిస్ధితిని సమీక్షిస్తోంది. కేంద్రం నుంచి నిధులు విడుదలైతే ప్రాజెక్టు పనులు తిరిగి ఊపందుకునే అవకాశముంది.

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం జగన్..!!#YSJagan #CMJagan #PolavaramProject #Polavaram #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/BZrhUzRGC8
— oneindiatelugu (@oneindiatelugu) June 6, 2023












Click it and Unblock the Notifications