కాన్వాయ్ లేకుండా వెళ్లిపోయిన జగన్: వైసిపి ఆందోళన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కల్పించిన భద్రత విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు.
అసెంబ్లీ ఆవరణలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌కి పార్కింగ్ స్థలం కేటాయించకుండా ఆయనను ఇబ్బంది పెడుతోందని తెలుగుదేశం సర్కారుపై ధ్వజమెత్తారు. కాగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లేకుండానే అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

విపక్ష నేతకు ఇవ్వాల్సిన కాన్వాయ్ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పైలట్, ఎస్కార్ట్ కోసం పాత వాహనాలను కేటాయించారని తెలిపింది.
ఈ విషయంపై తాము ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications