లిబియాలో తెలుగువాళ్లు: సుష్మాకు జగన్ లేఖ
హైదరాబాద్: లిబియాలో చిక్కుకున్న తెలుగువాళ్లను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. లిబియాలో చిక్కుకున్న తెలుగువాళ్ల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపు వేయి మంది తెలుగు ప్రజలకు లిబియాలో చిక్కుకుపోయినట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు.
లిబియాలో అంతర్యుద్ధం కారణంగా ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారు. హింస చెలరేగిన నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని అక్కడి ఎంబసీ భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలనూ వినియోగించుకోవాలని, ఘర్ణణలు జరుగుతున్న ప్రాంతాలనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది.

కర్నూలువాసులు సురక్షితం
ఇదిలావుంటే ఉపాధి కోసం వెళ్లి లిబియాలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లావాసులు సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ చెప్పారు. లిబియాలోని ఓ సిమెంట్ కర్మాగారంలో రెండేళ్ల ఒప్పందంతో పనిచేయడానికి కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సిమెంట్ నగర్‌కు చెందిన వంద మంది యువకులు వెళ్లారు.
ఈ ఏడాది జులై నెలతో కొంత మంది గడువు ముగిసింది. మరికొంత మంది గడువు ఆగస్టు నెల వరకు ఉంది. స్వస్థలాలకు చేరుకునేందుకు వారు లిబియా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయాన్ని తీవ్రవాదులు పేల్చివేయడంతో యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు విజయ్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications