హైదరాబాద్ లో జగన్ టూర్ రచ్చ..! రప్పా రప్పా ఫ్లెక్సీలు, పోలీసుల సెల్పీలు..!
ఏపీలో గతేడాది ఎన్నికల్లో ఓటమి తర్వాత అయితే తాడేపల్లిలో లేకపోతే బెంగళూరులో ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ వెళ్లారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇచ్చిన ఆదేశాలతో హాజరు నమోదు చేసుకునేందుకు జగన్ అక్కడికి వెళ్లారు. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ సందడి కనిపిస్తోంది.
జగన్ ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి కోర్టుకు బయలుదేరి వెళ్లారు. జగన్ వస్తున్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో అక్కడి అభిమానులు అలర్ట్ అయ్యారు. జగన్ ను కలిసేందుకు భారీగా నాంపల్లి కోర్టుకు తరలివచ్చారు. అయితే దీన్ని ముందుగానే ఊహించిన పోలీసులు ఎక్కడిక్కడ దారులు మూసేశారు.

మరోవైపు జగన్ రాక సందర్భంగా హైదరాబాద్ లో అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం డైలాగ్ రప్పా రప్పా తో కూడిన ఫ్లెక్సీలు కనిపించాయి. నగరంలోని పలు చోట్ల జగన్ ఫొటోతో రప్పా రప్పా డైలాగ్ తో కూడిన ఫ్లెక్సీల్ని స్థానిక అభిమానులు ఏర్పాటు చేశారు. అలాగే వాటిపై 2029లో రప్పా రప్పా అంటూ రాశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ రప్పా రప్పా ఖాయమని చెప్పడం ఆయన అభిమానుల ఉద్దేశంగా కనిపిస్తోంది. మరోవైపు ఎయిర్ పోర్టు నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చే లోపు జగన్ భద్రతకు వచ్చిన పోలీసులు సైతం ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడటం కనిపించింది.

జగన్ ఇవాళ నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు హాజరు నమోదు కోసం ఉదయం పదిన్నరకే అక్కడికి చేరుకున్నారు. అనంతరం జడ్జి పిలవగానే కోర్టు హాల్లోకి వెళ్లి హాజరు నమోదు చేసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్ లోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు.












Click it and Unblock the Notifications