"కేంద్రాన్ని ఒప్పించండి, సుప్రీంలో అయినా.."- చంద్రబాబుకు షర్మిల కీలక సూచన..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు చంద్రబాబు సర్కార్ చేసిన ప్రయత్నాలకు ఇవాళ హైకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్లు 59 శాతం మించొద్దంటూ హైకోర్టు ఈ జీవోల్ని కొట్టేసింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు చెల్లవని తెలిసినా బీసీల్ని సీఎం చంద్రబాబు బురిడీ కొట్టించారని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. అన్నీ తెలిసినా కమిషన్లు, రిపోర్టులు, జీవోల పేరుతో రాజకీయ డ్రామాలు ఆడారంటూ ఆరోపించారు.
రిజర్వేషన్ల పెంపు అని గత వైసీపీ ప్రభుత్వం జీఓ 176 ఇచ్చి బీసీలను మోసం చేస్తే, న్యాయం చేస్తామని నమ్మబలికి, జీఓలు 105, 1065 ఇచ్చి చంద్రబాబు సైతం చేసింది నమ్మకద్రోహం అని షర్మిల ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు చంద్రబాబు పొడిచింది వెన్నుపోటు అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రిజర్వేషన్ల పెంపు పేరిట వేసింది కపట నాటకాలన్నారు. హైకోర్టులో రిజర్వేషన్ల పెంపుపై జీవోలు మరోసారి కొట్టివేసినందుకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలన్నారు. అమలు కానీ హామీ ఇచ్చినందుకు బీసీలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.

బీసీలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో ఉన్నది మీ అనుబంధ బీజేపీ ప్రభుత్వమే కాబట్టి, వారిని ఒప్పించి చట్టాలు చేయాలన్నారు. కాలయాపన రాజకీయాలకు స్వస్థి పలికి, రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. కనీసం సర్వోన్నత న్యాయస్థానంలోనైనా సరైన వాదనలు వినిపించాలని చంద్రబాబుకు ఆమె సూచించారు. బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ల అమలు జరిగేలా చూడాలని ..ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీలో విపక్షాలు చంద్రబాబు సర్కార్ ను టార్గెట్ చేశాయి. దీంతో గతంలో రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం కాస్తా ఇప్పుడు ఇరుకునపడింది. బీసీ రిజర్వేషన్లను జగన్ అడ్డుకున్నారంటూ చంద్రబాబు హైకోర్టు తీర్పు తర్వాత ఆరోపిస్తున్నారు.













Click it and Unblock the Notifications
