అమరావతి భూసేకరణ ఆపాలన్న షర్మిల..! అక్కడ కట్టాకే ఇక్కడ తీసుకోండి..!
ఏపీలో అమరావతి రాజదాని కోసం ప్రభుత్వం చేపడుతున్న రెండో విడత భూసేకరణపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ నిప్పులు చెరిగారు. అమరావతిలో ప్రధాని మోడీ తొలిసారి రాజధానికి శంఖుస్థాపన చేసిన ప్రాంతంలో నిరసన చేపట్టిన షర్మిల.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మళ్లీ భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకే అంతర్జాతీయ విమానాలు రావడం లేదని, మళ్లీ అమరావతిలో ఎయిర్ పోర్టు అవసరమా అని ప్రశ్నించారు.
2015లో ప్రధాని మోడీ వచ్చారని, శిలాఫలకం వేసి మట్టి కొట్టి వెళ్ళారని షర్మిల ఆరోపించారు. శంకుస్థాపన చేసి 10 ఏళ్లు దాటిందని, మోడీ మల్లి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారని గుర్తుచేశారు. సేమ్ సీట్ రిపీట్ చేశారన్నారు. మోడీ మాటలు వినటానికి,చూడటానికి అసహ్యం గా ఉందన్నారు. మోడీ మాటలు నమ్మి చంద్రబాబు రాత్రి పడ్డ గోతిలో పగలు పడ్డారన్నారు. మోడిని మళ్ళీ ఎలా నమ్మారో తెలియదన్నారు. 2015లో 33 వేల ఎకరాల భూములు సేకరించారని, మరో 20 వేల ఎకరాల భూమి ఉంది అన్నారని తెలిపారు.

54 వేల ఎకరాల్లో రాజధాని కడతాం అన్నారని, సింగపూర్,జపాన్ అన్నారని, రాజధాని బెస్ట్ లెవెబుల్ సిటీ అన్నారని గుర్తుచేశారు. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే పిచ్చి మొక్కలు తప్పా ఏమీ లేదన్నారు. 29 వేల మంది రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారని, వారి త్యాగం ఇంత వరకు ఫలించలేదని తెలిపారు. భూమి లేని కుటుంబాలు దాదాపు 23 వేల మందికి న్యాయం జరగలేదన్నారు. ఈ రోజు రాజధాని నిర్మాణం అంచనా 70 వేల కోట్లకు దాటిందన్నారు. దాదాపు 53 వేల కోట్ల టెండర్లు కూడా పిలిచారని, ఇప్పటికి రాజధాని పేరుతో ఆంధ్రా ప్రజలను భ్రమలో పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.
నిజానికి రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యతని షర్మిల గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ అన్నారు.
విభజన హామీల్లో రాజధాని నిర్మాణం ఉందన్నారు. మోడీ సైతం డిల్లీని తలపించే రాజధాని అన్నాడని, కానీ 10 ఏళ్లలో 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాజధాని కి అప్పులు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికీ కేంద్రం నిర్మించి ఇవ్వాల్సి ఉందన్నారు. రాజధాని పేరుతో అప్పులు ఎందుకు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంక్ రుణాల ను కేంద్రం తన నెత్తి మీద వేసుకుంటుంది అని అంటుందని, దీని మీద క్లారిటీ లేదన్నారు.

రాజధాని కోసం ప్రైవేట్ బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తున్నారని, 30 వేల కోట్లు ఇప్పటికే అప్పులు తెచ్చారని షర్మిల విమర్శించారు. మరో 40 వేల కోట్లు రాజధాని పేరుతో అప్పులు చేస్తారట అన్నారు. ఈ అప్పులు ఎందుకు ? చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన బలంతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఇంత బలం చంద్రబాబు దగ్గర పెట్టుకొని అప్పులు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో కేంద్రంలో ప్రభుత్వం నిలబడి ఉందని, మీ బలాన్ని ఉపయోగించి రాజధాని సాధించలేరా అని అడిగారు.
రాజధాని నిధులు మోడీ మెడలు వంచి తీసుకు రాలేరా ? మోడీకి ఎందుకు గులాం గిరి చేస్తున్నారు ? విభజన హామీ ప్రకారం మన హక్కు అని మీకు తెలియదా ? అప్పులు తెచ్చి జనాల నెత్తిన ఎందుకు పెడుతున్నారు ? అని షర్మిల ప్రశ్నలవర్షం కురిపించారు. ఇప్పటికే రాష్ట్రం నెత్తిన 11 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, ఇంకా అదనపు అప్పులు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. మోడీ కాలర్ పట్టుకొని రాజధాని కి నిధులు తీసుకు రావాలన్నారు. ఇవన్నీ మీరు మరిచి పోయి మళ్ళీ అరచేతిలో భ్రమలు చూపిస్తున్నారన్నారు.
మొదట తీసుకున్న భూముల్లో ఇంతవరకు రాజధాని కట్టలేదని, ఇప్పుడు మరో 40 వేల ఎకరాలు మళ్ళీ కావాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 2015 లోనే మూడేళ్లలో రాజధాని కడతాం అన్నారని, ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్లలో రాజధాని కడతాం అంటున్నారని ఆరోపించారు. అప్పుడు ఇప్పుడు ఒకటే మాట , ముందు సేకరించిన 33 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలన్నారు. ఆది పక్కన పెట్టీ... కొత్తగా 40 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.
బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేందుకు భూములు సేకరిస్తున్నారా ?అమరావతికి అంత బిజినెస్ ఉందా ? బిజి..నెస్ ఉందా ? అని ప్రశ్నించారు. ఒక్క అంతర్జాతీయ విమానం కూడా ఇప్పటికీ లేదని, కేవలం విజయవాడకు ATR విమానాలే దిక్కని షర్మిల తెలిపారు. గన్నవరం విస్తరణ అన్నారని, దానికి దిక్కులేదన్నారు. చంద్రబాబు కొద్దిగా భూమి మీద నడవాలన్నారు. ఆలు లేదు..చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. గన్నవరం విస్తరణ మీద ముందు దృష్టి పెట్టాలన్నారు. రెండో దఫా 40 వేల కోట్ల భూ సేకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం అన్నారు. మలి విడత భూములపై పెద్ద కుట్ర ఉందన్నారు. తొలి విడత రాజధాని కోసం, మలి విడత భూములు అమ్మాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుందన్నారు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఒకే, మనకు ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్ ? అని షర్మిల ప్రశ్నించారు. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం ది.. మోడీ ది అన్నారు. వెంటనే మలి విడత భూ సేకరణ ఆపాలన్నారు. తొలి విడత సేకరించిన 33 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలన్నారు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ సంతోషంగా లేరన్నారు. వారికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదన్నారు. వారి త్యాగానికి ప్రతిఫలం అందలేదన్నారు. మోడీ కాలర్ పట్టుకొని నిలదీయండి... లక్ష కోట్లు అయితే... లక్ష కోట్లు, 50 వేల కోట్లు అయితే, 50 వేల కోట్లు మోడీ నుంచి తేవాలన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా ను బంద్ చేసి రాజధాని మీద దృష్టి పెట్టాలని కోరారు.












Click it and Unblock the Notifications