
అవినాష్ కు నోటీసులపై షర్మిల రియాక్షన్-సీబీఐ ముందు డిమాండ్-జగన్ కు కీలక సలహా...!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ వరుసగా రెండోరోజు పులివెందులలో సీబీఐ అధికారులు పర్యటిస్తున్నారు. ఆధారాల వేటతో పాటు మరికొందరు అనుమానితులకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అవినాష్ కు ఇచ్చిన నోటీసులపై సోదరి వైఎస్ షర్మిల స్పందించారు.
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో గొప్ప నాయకుడు వివేకానందరెడ్డి అని షర్మిల వ్యాఖ్యానించారు. ఆయన హత్య జరిగి ఇన్ని రోజులైనా హంతకులు, కేసు దర్యాప్తు ఇప్పటికీ తేలడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసును త్వరగా తేల్చాలని సీబీఐని వైఎస్ షర్మిల కోరారు. తద్వారా ఏపీలో సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపై తన అభ్యంతరాల్ని వ్యక్తం చేశారు.

అదే సమయంలో తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కూడా వైఎస్ షర్మిల ఓ కీలక సలహా ఇచ్చారు. ఈ కేసులో జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని ఆమె సూచించారు. తద్వారా అధికార పార్టీ తన బలంతో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయొద్దని షర్మిల కోరారు. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ కుటుంబ పాత్రపై సీబీఐ దర్యాప్తు ముందుగు సాగకుండా అడ్డంకులు కల్పిస్తున్నారన్న సీబీఐ అధికారుల ఆరోపణల నేపథ్యంలో షర్మిల చేసిన సూచన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.