మరో బాంబు పేల్చిన షర్మిల-ఆస్తుల కేసులో వైఎస్ ను చేర్చిన జగన్..!
ఏపీలో తన అన్న వైఎస్ జగన్ తో రాజకీయంగా విభేధిస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్న సోదరి వైఎస్ షర్మిల తాజాగా మరో బాంబు పేల్చారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ తనతో పాటు దివంగత మాజీ సీఎం, తండ్రి వైఎస్సార్ పేరును ఆస్తుల కేసులో చేర్చి వేధిస్తోందని జగన్ ఆరోపిస్తుండగా.. దానికి షర్మిల ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఆస్తుల కేసులో వైఎస్ పేరును చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్వయంగా జగనే అని ఆమె సంచలన ఆరోపణ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అక్రమాస్తుల కేసులో తనను అరెస్టు చేసి జైలుకు పంపిందని, అలాంటి పార్టీలో షర్మిల చేరిందంటూ జగన్ చేస్తున్న ఆరోపణలకు షర్మిల గుంటూరు జిల్లా ప్రచారంలో కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని ఆమె వెల్లడించారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్సార్ పేరును ఛార్జిషీట్ లో జగన్ చేర్చించారని ఆమె ఆరోపించారు.

ఆస్తుల కేసుల నుంచి బయట పడేందుకు జగన్ కావాలని పిటీషన్ వేయించారని షర్మిల ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో హైకోర్టు లో పిటీషన్ వేయించిందే జగన్ రెడ్డి అన్నారు. అదే పోన్నవోలు కి ఇప్పుడు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఇది నిజం కాదని దమ్ముంటే జగన్ సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్ పై ఛార్జిషీట్ లో కాంగ్రెస్ పాత్ర లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పొరబాటున వైఎస్ పేరు చేర్చిందని చెప్పిన షర్మిల ఇప్పుడు మాట మార్చడం విశేషం.












Click it and Unblock the Notifications