సొంత కొడుకై ఉండి.. జగన్ పై షర్మిల ఫైర్-రాజీ చర్చల ప్రచారం వేళ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతకు ముందు దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎలా నిర్వీర్యం చేశారో వివరిస్తూ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఫైర్ అయ్యారు. నాన్న మానసపుత్రిక అయిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అన్న ఎలా నిర్వీర్యం చేశాడో గుర్తుచేశారు. అదే సమయంలో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ షర్మిల తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జగన్, షర్మిల మధ్య రాజీ చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం ఫీజు రీయింబర్స్ మెంట్ అని షర్మిల తెలిపారు.పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం ఇది అన్నారు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరుగార్చారని విమర్శించారు.

విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటన్నారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని, దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదన్నారు. వైఎస్సార్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే..అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడయ్యారన్నారు. బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడు జగన్ అన్నారు. అలాంటి వాళ్లకు వైఎస్సార్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం,ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటన్నారు.
నాడు వైసీపీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వంనిర్లక్ష్యం చేస్తోందని షర్మిల విమర్శించారు. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపమన్నారు. బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు మీపై ఉందని చంద్రబాబుకు గుర్తుచేశారు. కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు.












Click it and Unblock the Notifications