జగన్ పై షర్మిల మాటల దాడి తీవ్రం..! మీ వల్లే చంద్రబాబు పనులు-అహంకారంతోనే పతనం..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆయన సోదరి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మాటల యుద్దం అంతకంతకూ తీవ్రమవుతోంది.జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రశ్నిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబుతో ఆమె కుమ్మక్కయ్యారంటూ వైసీపీ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. దీనిపై ఇవాళ స్పందించిన షర్మిల.. జగన్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా అని షర్మిల ఇవాళ ప్రశ్నించారు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపర్చేంత ద్వేషం మీకుంది కానీ తనకు లేదని షర్మిల తెలిపారు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందన్నారు.

ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని అడిగారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నిస్తానన్నారు. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని తెలిపారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పేనని, కాబట్టే తప్పని చెప్పామన్నారు. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నామన్నారు. వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే తానే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించిన విషయం గుర్తుచేశారు.
అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని జగన్ కు చురకలు అంటించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదన్నారు. అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లని బొత్సను కూడా ఇందులోకి లాగారు. వైఎస్సార్సీపీలో ఎప్పుడో వైఎస్సార్ ను వెళ్లగొట్టారని, ఇప్పుడున్నది వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరె్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అన్నారు. కాబట్టి వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే, మీకు మీడియా పాయింటే ఎక్కువన్నారు.
మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫి చేసినందుకు గర్వపడుతున్నామని జగన్ కు షర్మిల తెలిపారు. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారని,4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారని,ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారని ఆరోపించారు.
మద్యపాన నిషేధం అని దగా చేశారని,మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..? అని ప్రశ్నించారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టాంటూ రెచ్చిపోయారు. మీ అహంకారమే మీ పతనానికి కారణం అని ఓ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.












Click it and Unblock the Notifications