ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ పిల్లలు షర్మిల, జగన్ మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఇప్పటికే వివేకా హత్య విషయంలో షర్మిలను టార్గెట్ చేస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు.. అనంతరం ఆమె ఇస్తున్న కౌంటర్లతో రాజకీయం వేడెక్కింది. ఇదే క్రమంలో తాజాగా వైఎస్ జగన్ ను మరో విషయంలో టార్గెట్ చేస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు. నిన్న విజయనగరం మేమంతా సిద్ధం సభలో మంత్రి బొత్సను తండ్రి సమానుడంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ అయ్యారు.
ఇవాళ రేపల్లెలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల... బొత్సను తండ్రి సమానుడిగా జగన్ పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీ లో వైఎస్సార్ ను తిట్టిపోసిన వ్యక్తి అని షర్మిల ఆరోపించారు. ఇదే బొత్స వైఎస్సార్ ను త్రాగుబోతు అని తిట్టాడన్నారు. జగన్ కు ఉరి శిక్ష వేయాలని అన్నాడన్నారు. జగన్ మోహన్ రెడ్డి బినామీలు అన్నాడన్నారు. విజయమ్మ ను సైతం అవమాన పరిచాడని గుర్తుచేసారు. ఇలాంటి బొత్స జగన్ కి తండ్రి సమానులు అయ్యారనని ఆక్షేపించారు.

జగన్ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు అందరు వైఎస్సార్ ను తిట్టిన వాళ్ళేనని షర్మిల ఆరోపించారు. వైఎస్ ను తిట్టిన వాళ్ళకే జగన్ పెద్దపీట వేశారని విమర్శించారు. వీళ్ళందరూ తండ్రులు,అక్కలు,చెల్లెల్లు అన్నారు. నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్ళు ఈయనకు ఏమి కారన్నారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ కారన్నారు. ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమి కారన్నారు. అసలు వైఎస్సార్సీపీ పార్టీలో వైఎస్సార్ లేడని షర్మిల ఆరోపించారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి , ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications