అసెంబ్లీలో వైఎస్ సునీత: అనూహ్య పరిణామం..!!
YS Vivekananda Reddy's murder case: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షం అంటూ లేకపోయినప్పటికీ అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సభ్యులే ఆ పాత్రను పోషిస్తోన్నారు. కూటమి ప్రభుత్వంలోని లోపాలు, నియోజకవర్గాల స్థాయిలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి అసెంబ్లీలో కనిపించారు. తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి అసెంబ్లీలో ప్రత్యక్షం అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో వారిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మార్చి 15వ తేదీన తెల్లవారు జామున పులివెందులలోని తన నివాసంలో ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ హత్యకేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. దీనిపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడం ఈ కేసులో చోటు చేసుకున్న కీలక పరిణామం.
ఇప్పటివరకు తన తండ్రి హత్యకేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి తాజాగా సునీత రెడ్డి.. భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఆవరణలో కనిపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను ఆమె కలిసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోనూ సమావేశమైనట్లు సమాచారం.
ఇటీవలే సునీత రెడ్డి కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వీ విద్యాసాగర్ నాయుడితోనూ భేటీ అయినట్లు చెబుతున్నారు. వివేకానందరెడ్డి హత్యతో ప్రమేయం ఉన్నవారందరినీ చట్టపరంగా శిక్ష పడేలా చేయాలంటూ ఆమె పోరాటం సాగిస్తోన్నారు.
ఈ క్రమంలో తన సొంత సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరోవంక ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications