ఆ షేర్లన్నీ నావే-జగన్, భారతికి విజయమ్మ షాక్..! షర్మిలకు రిలీఫ్..?
వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని వివాదాస్పద సరస్వతీ పవర్ వాటాలకు సంబంధించి గతంలో వైఎస్ జగన్ హైదరాబాద్ లోని జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ లో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన తల్లి వైఎస్ విజయమ్మ ఆయనతో పాటు భార్య భారతికి కూడా షాకిచ్చారు.
ఈ వివాదంలో షర్మిలకు ఊరట దక్కే విధంగా విజయమ్మ కోర్టులో తన స్టాండ్ చెప్పేశారు.

సరస్వతీ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ వాటాల కొనుగోలు, గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ గతంలో తన పేరుపైనే బదలాయించినట్లు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ ఎన్సీఎల్టీకి తెలిపారు. కాబట్టి సరస్వతీ పవర్ వాటాలపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని వెల్లడించారు. సరస్వతీ పవర్ లో 99.75 శాతం వాటాలు తన పేరుతోనే ఉన్నాయని, ఇందులో వైఎస్ జగన్ , భారతిలకు వాటాలు లేవని ఎన్సీఎల్టీలో విజయమ్మ తేల్చిచెప్పేశారు.
తన కూతురు రష్మిలతో ఉన్న రాజకీయ వివాదాల కారణంగానే అన్యాయంగా తల్లినైన తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు. సెక్షన్ 59ను తప్పుగా అన్వయించి తనకు వాటాల బదలాయింపు అక్రమం అంటూ పిటిషన్ దాఖలు చేసారని విజయమ్మ తెలిపారు. ఈ మేరకు తాము గతంలో బదలాయించిన వాటాల్ని తిరిగి తమకు ఇచ్చేయాలంటూ జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసి భారీ జరిమానా విధించాలని విజయమ్మ ఎన్సీఎల్టీని కోరారు.
2021లో సరస్వతీ పవర్ లోని 46.71 లక్షల వాటాల్ని సండూర్ కంపెనీ, 71.50 లక్షల వాటాల్ని క్లాసిక్ రియాల్టీ కలిపి మొత్తం 1.21 కోట్ల వాటాల్ని తనకు విక్రయించారని విజయమ్మ తెలిపారు. అలాగే జగన్ 74.26 లక్షల వాటాలు, భారతి 40.50 లక్షల వాటాలు తనకు గిఫ్ట్ డీడ్ కింద బదిలీ చేశారని వెల్లడించారు. దీని ప్రకారం గతేడాది జూన్ 14న తనకు ఈ మేరకు వాటాలు బదిలీ అయ్యాయన్నారు. దీన్ని సరస్వతీ పవర్ బోర్డు కూడా ఆమోదించి తనను సభ్యురాలిని చేసిందన్నారు. కాబట్టి కంపెనీలో 99.75 శాతం వాటా ఉన్న తనను కుటుంబ కారణాలతో ప్రశ్నించడం కుదరదన్నారు. జగన్, షర్మిల ఆస్తి వివాదాలతో ఎన్సీఎల్టీలో జగన్ వేసిన పిటిషన్ కు సంబంధం లేదన్నారు. గుంటూరు జిల్లాలో ఈడీ జప్తు చేసిన సరస్వతీ పవర్ ఆస్తులపై మాత్రమే స్టేటస్ కో ఉందన్నారు. షర్మిల కోసమే తనకు జగన్, భారతి ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్లు చేసిన వాదనకు ఆధారాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications