వైఎస్ వివేకా హత్యపై స్పందించిన చెల్లెలు విమలా రెడ్డి: అయినా వారికి బుద్ధి రాలేదు
కడప: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై ఆయన చెల్లెలు వైఎస్ విమలా రెడ్డి స్పందించారు. రాజకీయ ప్రమేయం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించిన తరువాత కూడా ఈ కేసు కొనసాగించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావట్లేదని చెప్పారు. ఎవరినో ఇరికించాలనే ఉద్దేశంతోనే కేసును కొనసాగిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని అన్నారు.

నేరాన్ని అంగీకరించినా..
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమల రెడ్డి మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్యలో వైఎస్ కుటుంబానికి ప్రమేయం లేదని వైఎస్ విమల రెడ్డి స్పష్టం చేశారు. వివేకాను హత్య చేసింది బయటి వాళ్లేనని పేర్కొన్నారు. ఆయనను హత్య చేసిన వారు తమ నేరాన్ని సైతం అంగీకరించారని అన్నారు. ఇంతటితో దీన్ని ఆపేయడానికి అవకాశం ఉన్నప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. నిందితులు అప్రూవర్‌గా మారి- తమ నేరాన్ని అంగీకరించిన తరువాత కూడా దీన్ని ఎందుకు కొనసాగించాల్సి వస్తోందని ప్రశ్నించారు.

రాజకీయాల కోసం నీచాతి నీచంగా..
రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని కొనసాగిస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ కుటుంబంపై రాజకీయంగా పగ సాధించడానికి ఈ ఘటనను అడ్డుగా పెట్టుకుని ఉండొచ్చని అన్నారు. రాజకీయాల కోసం నీచాతి నీచమైన స్థితిలోకి జారిపోతున్నారని విమల రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు, ఆస్తుల, రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఒకరికొకరు చంపుకొనే పరిస్థితులు వైఎస్ కుటుంబం మధ్య లేవని తేల్చి చెప్పారు.

కుటుంబ ప్రమేయం లేదు..
వైఎస్ వివేకా హత్యకేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతమాత్రం లేదని విమల రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కేసులో నిందితులుగా అరెస్టయిన నలుగురూ- హత్య చేసినట్లు అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. హత్య ఎలా చేశామనే విషయాన్ని స్పష్టంగా తేల్చేసిన తరువాత ఆ కేసు దర్యాప్తును అక్కడే ఆపేయవచ్చని వ్యాఖ్యానించారు. ఈ కేసును కొనసాగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేది స్పష్టమౌతోందని ఆమె పేర్కొన్నారు.

దర్యాప్తు కొనసాగించడం.. సమస్యను పరిష్కరించినట్టా..
ఎవరినో ఇరికించాలనే ఉద్దేశంతోనే ఈ కేసు దర్యాప్తును కొనసాగింపజేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమల రెడ్డి అన్నారు. దీనికి ముగింపు ఎక్కడ ఉంటుందని ప్రశ్రించారు. దర్యాప్తు కొనసాగించడం- సమస్యలను పరిష్కరించినట్లు కాదని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఇంతగా చెడ్డపేరు రావడం తన జీవితంలో ఇప్పటిదాకా చూడలేదని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణానంతరం ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ విజయమ్మ పోటీ చేసిన సందర్భాన్ని విమల రెడ్డి గుర్తు చేశారు.

రాజకీయ కారణాలతోనే విజయమ్మపై వివేకా పోటీ..
విజయమ్మ మీద పోటీ చేయొద్దంటూ కుటుంబ సభ్యులందరం కలిసి వివేకా కోరామని, మొదట్లో ఆయన అంగీకరించారని, ఆ తరువాత రాజకీయపరమైన ఒత్తిళ్లకు తలొగ్గినట్టు కనిపించిందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూతతో ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గం నుంచి మొదట్లో విజయమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తరువాత 2011 ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ తరఫున విజయమ్మ బరిలో నిలిచారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకానంద రెడ్డి పోటీ చేసి, ఓడిపోయారు.

విజయమ్మకు అండగా ఉన్నాం..
విజయమ్మ మీద వివేకా పోటీ సమయంలో వైఎస్ కుటుంబ సభ్యులుగా తాము తీవ్ర ఆవేదనకు గురయ్యామని విమల రెడ్డి చెప్పారు. ఒక వైపు అన్న (వైఎస్ రాజశేఖర్ రెడ్డి)ను కోల్పోయిన వదిన- మరో వైపు తోడబుట్టిన వివేకా పోటీలో ఉండటం తమను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడటానికి నీచాతి నీచమైన రాజకీయాలే కారణమని విమలా రెడ్డి చెప్పారు. విజయమ్మపై వివేకా పోటీ చేయడానికి ఈ రాజకీయ కారణాలే కారణమని అందుకే తాము విజయమ్మకు అండగా నిలవాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అయినా వారికి బుద్ధి రాలేదు..
తామందరూ విజయమ్మ వైపే ఉన్న సమయంలో వివేకా అన్న, ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటారని చెప్పారు. వైఎస్ కుటుంబానికి అత్యంత గడ్డురోజులుగా విమల రెడ్డి అభివర్ణించారు. అయినప్పటికీ- వారికి బుద్ధి రాలేదని, మళ్లీ అలాగే చేస్తోన్నారని అన్నారు. రాజశేఖరన్న ఈ లోకాన్ని వదలి పెట్టి వెళ్లినప్పటి నుంచీ ఆయన కుటుంబానికి అన్నీ బాధలేనని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ, జగన్, షర్మిల.. వారందరూ అనేక ఇబ్బందులు పడ్డారని, వారి ఆవేదనను మాటల్లో వర్ణించలేమని అన్నారు.

వివేకా పిల్లలు ఇలా చేస్తున్నారంటే..
2011 ఉప ఎన్నికల్లో పోటీ తప్ప- ఇంకెప్పుడూ రాజశేఖర్ రెడ్డి కుటుంబం- వివేకా కుటుంబ సభ్యులను దూరం పెట్టలేదని విమల రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి-వివేకానంద రెడ్డిని రామలక్ష్మణుల్లా పిలిచేవారని, వైఎస్సార్ మరణానంతరం వివేకాతో తమ అనుబంధం బలపడిందని, కుటుంబానికి పెద్దదిక్కుగా భావించామని అన్నారు. అలాంటిది- రాజకీయాల కారణంతో వివేకా అన్న పిల్లలు ఇలా చేస్తోండటం చాలా అన్యాయమని చెప్పారు.












Click it and Unblock the Notifications