జగన్ పై పోరుకు మళ్లీ సునీత..! పులివెందులలో కూటమి కోసం ..!
ఏపీలో ఎల్లుండి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కూటమితో పాటు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే కూటమి పార్టీలు దౌర్జన్యాలు చేస్తున్నాయంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో పాటు హైకోర్టునూ పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై ఈసీ స్పందించి అలాంటిదేమీ లేదని జవాబు ఇచ్చింది. ఈ నేపథ్యలో పులివెందులలో జరగబోతున్న జడ్పీటీసీ ఉపఎన్నిక ఇప్పుడు వైసీపీ, టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది. వైసీపీ నుంచి దివంగత జడ్పీటీసీ కుమారుడి రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమికి మద్దతుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె రంగంలోకి దిగారు. స్థానిక కూటమి నేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని రోజులుగా పులివెందుల ఎన్నికల్లో యాక్టివ్ అవుతున్న సునీతారెడ్డి వైసీపీ నేతలపై విమర్శలకు దిగుతున్నారు. తన తండ్రి లాగే మరో హత్య చేసేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి కుట్ర చేశారని తాజాగా ఆరోపించారు.

ఇవాళ సునీతారెడ్డిని, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని వారి నివాసానికి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలిశారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. ఇప్పటికే కూటమికి అండగా నిలుస్తూ వైసీపీ అభ్యర్ధిని ఎలాగైనా ఓడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన సునీత.. సహజంగానే ఆదినారాయణరెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణరెడ్డిని గతంలో వివేకా హత్య కేసులో ఇరికించాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు కూడా చేశారు.
గతంలో 2024 ఎన్నికల సమయంలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డిని ఓడించేందుకు షర్మిలతో కలిసి ఇలాగే ప్రయత్నాలు చేసిన సునీతారెడ్డి విఫలమయ్యారు. అయినా మరోసారి పట్టువదలకుండా పులివెందుల ఉపఎన్నికల్లో జడ్పీటీసీని గెలిపించుకోవడం ద్వారా ఇక్కడ పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో సునీతారెడ్డి రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలోనే ఎంట్రీ ఇచ్చి తన తండ్రి హత్య గురించి మాట్లాడుతోందన్న విమర్శల్ని ఆమె ఎదుర్కొంటున్నారు.
పాత పులివెందులను తెస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారని, అంటే తమ కన్నుసన్నల్లో అధికారుల్ని ఉంచుకుని అరాచకాలు చేస్తారా అని సునీతారెడ్డి ప్రశ్నించారు. తాను పులివెందులలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. వైసీపీ కార్యకర్తకు గాయాలు అయ్యారని ఆ పార్టీ నేతలు నిరసనలు చేశారని, అప్పట్లో తన తండ్రి వివేకా హత్య జరిగితే ఎవరినీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుకున్నారని సునీత విమర్శించారు.












Click it and Unblock the Notifications