రంగంలోకి దిగిన జగన్: భూమాతో చర్చలు, కర్నూలు ఎమ్మెల్యేలకు పిలుపు
విజయవాడ: తాజా పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు చేజారకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నష్టనివారణ చర్యలు చేపట్టారు. భూమా నాగిరెడ్డితో జగన్ చర్చలు చేస్తున్నారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ శాసనసభ్యులను హైదరాబాద్ రావాల్సిందిగా జగన్ ఆదేశించారు.
కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 11 మంది శాసససభ్యులున్నారు. వీరిలో కనీసం నలుగురు ఒకటి రెండు రోజుల్లో టిడిపిలోకి జంప్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవిని చంద్రబాబు ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు.
ఆయన తరఫున పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి భూమా నాగిరెడ్డితో చర్చలు జరిపారు. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియతో పాటు మరో ఇద్దరు మాత్రం టిడిపిలో చేరేందుకు కచ్చితమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారు చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇదిలావుంటే, భూమా నాగిరెడ్డితో పాటు ఇతర శాసనసభ్యులు పార్టీలో వస్తున్న నేపథ్యంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పార్టీ నేతలతో శనివారం సాయంత్రం 3 గంటలకు సమావేశమవుతున్నారు.
భూమా నాగిరెడ్డితో చర్చలు జరిపిన తర్వాత విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో మాట్లాడారు. తమకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని భూమా నాగిరెడ్డి వారిద్దరికీ వివరించినట్లు సమాచారం.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, వారు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి చిన్నరాజప్ప తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు.












Click it and Unblock the Notifications