పులితోలు కప్పుకున్న నక్క: బాబుపై జగన్ పార్టీ నేతలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పులితోలు కప్పుకున్న నక్క అని విమర్శించారు. మూడు నెలల్లో ఆయన బండారం బయటపడుతుందని అన్నారు.
ఎన్నికల్లో గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీని వీడుతున్నారంటూ వచ్చిన కథనాలను ఖండించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించే విధంగా వ్యవహరించాలే గానీ, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి తమ నేతలను చంద్రబాబు తన వైపుకు తిప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఓ సమయంలో మనం ఎక్కడకు పోతున్నామని ప్రశ్నించిన చంద్రబాబే.. ఇప్పుడు ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారని మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. ప్రతిపక్షం నిలదీస్తుందనే భయంతోనే.. ప్రతిపక్షమే లేకుండా చేయాలని బాబు తపన పడుతున్నారని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవర్చేందుకు తాము టిడిపి ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాము ప్రజల కోసం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీకి చెందిన నేతలెవరకూ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. ప్రలోభాల కోసమో, మరోదాని కోసమో.. ఒకరిద్దరూ విడిచి వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications