పోటీ వీడియో: లోకేష్‌ను లాగారు, 16 ఏళ్ల కుర్రాడా.. బాబును దులిపిన రోజా
హైదరాబాద్: పట్టిసీమ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మధ్యవర్తిత్వం నెరిపారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం తీవ్ర ఆరోపణలు చేసింది. సభలో అధికార పక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చెవిరెడ్డి భాస్కర రెడ్డి సాయంత్రం వైసీపీ కార్యాలయంలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రే మర్యాద లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సభా నాయుకుడి తీరు ఇదేనా అన్నారు. చంద్రబాబు తన సభ్యులను ఉసిగొల్పుతున్నారన్నారు. టీడీపీ సభ్యులు తొడలు గొట్టిసవాల్ చేశారన్నారు. పట్టిసీమ విషయంలో నారా లోకేష్ మధ్యవర్తిత్వం చేశారని, ఆయన జేబుల్లోకి రూ.380 కోట్లు పోతుందని ఆరోపించారు.
అసెంబ్లీలో పాతరేస్తామని బోండా ఉమ అంటే, అంతుచూస్తామని చంద్రబాబు అంటారని ఇదేమిటన్నారు. ప్రతిపక్ష సభ్యులను బతకనిచ్చేలా లేదన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే మొత్తం వీడియోను విడుదల చేయాలన్నారు. జగన్‌కు మైక్ ఇవ్వవద్దంటూ స్పీకర్ వైపు చూస్తూ చంద్రబాబు తల అడ్డంగా ఊపారని చెప్పారు.
మొత్తం దృశ్యాలను బయటపెట్టాలన్నారు. చంద్రబాబు సభ్యులను రెచ్చగొట్టారన్నారు. పట్టిసీమ విషయంలో అక్రమాలు బయటపడటంతో టీడీపీ డ్రామా ఆడిందన్నారు. జగన్‌కు మాట్లాడేందుకు అరగంట సమయం కూడా ఇవ్వలేదన్నారు. జగన్‌కు అరగంట ఇవ్వలేదు కానీ, వైయస్‌ను తిట్టేందుకు రెండు రోజులు తీసుకున్నారన్నారు.
పట్టిసీమ విషయంలో తాను బయటపడేందుకు, తనయుడిని కాపాడకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారన్నారు. టీడీపీ సభ్యులు వైయస్ జగన్ పైన దూషణలకు పాల్పడ్డారన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే.. ఇక్కడ్నుంచి బయటకు వెళ్లలేరని హెచ్చరించారన్నారు.
అసెంబ్లీ వీడియో దృశ్యాలను ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. సభ ఘటన దృశ్యాలు ఎలా విడుదల చేశారో చెప్పాలన్నారు. ఇది అసెంబ్లీ ఆస్తి అని, వీటిని ఎవరు విడుదల చేశారో తెలియాలన్నారు. ఏబీఎన్ ఇచ్చిందా లేక సభాపతి ఇచ్చారా చెప్పాలన్నారు. స్పీకర్ ఇస్తే సమాధానం చెప్పాలని, ఏబీఎన్ ఛానల్ ఇస్తే కనుక చీటింగ్ కేసు పెట్టాలన్నారు.

చంద్రబాబు మాకు గొప్ప కాదు: రోజా
అసెంబ్లీలోనే టీడీపీ రౌడీయిజానికి పాల్పడిందని ఎమ్మెల్యే రోజా అన్నారు. తాము ఒక అమ్మకు, అబ్బకు పుట్టామన్నారు. కాలి గోటికి సరిపోరని టీడీపీ ఎమ్మెల్యేలు అంటే.. ఆ తర్వాతనే తాను తన కాలి గోటికి సరిపోరని చెప్పానని అన్నారు. చంద్రబాబు టీడీపీ వారికి గొప్ప కావొచ్చని, తనకు కాదన్నారు.
తాను సినిమా ఇండస్ట్రీలో 24 ఏళ్లు, రాజకీయాల్లో 12 ఏళ్లుగా ఉంటున్నానని తనను ఎవరు ఏమీ అనలేదన్నారు. జగన్ చిన్నపిల్లాడు కదా.. నలిపేస్తామనుకున్నారని, కానీ ఆయన లేవెనత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన పైన దొంగ అంటున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ఉన్న అసెంబ్లీలో ఉన్నందుకు తాను సిగ్గుతో తలదించుకుంటున్నానని చెప్పారు. మంత్రి పీతల సుజాత ప్రతిసారి తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. పట్టిసీమపై చర్చకు సిద్ధమన్నవాళ్లు నిన్నటి నుండి జగన్‌కు అడ్డుపడుతున్నారన్నారు.
వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకొని కామెంట్స్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. చీఫ్ విఫ్ కాలువ శ్రీనివాసులు సభను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు నిరసన తెలపడం తమ హక్కు అన్నారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బాబు కాలి గోటికి సరిపోవని సుజాత అంటే తాను.. కూడా నా కాలి గోటికి సరిపోవని అన్నానన్నారు. తాను వెన్నుపోటు పొడిచి రాలేదన్నారు. రెండున్నర ఎకరాలతో వచ్చిన వాడు చంద్రబాబు అన్నారు.
హూ ఈజ్ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. టైం బాగుండి ఎన్టీఆర్ అల్లుడయ్యారని, ముఖ్యమంత్రి అయ్యారన్నారు. చంద్రబాబు టీడీపీ వాళ్లకు గొప్ప కావొచ్చునని, తమకు మాత్రం కాదన్నారు. జగన్ గురించి అబద్దాలతో కూడిన కట్టుకథలు చెబితే తాము నిరసన తెలిపామన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బొండా ఉమ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ను విడుదల చేసింది. అలాగే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా విడుదల చేసింది. ఈ సమయంలో ఓ ఛానల్ విలేకరుతో రోజాకు వాదన జరిగింది. మీరు ఏబీఎన్ ఛానల్ కదా.. అలాగే మాట్లాడుతారని ఆమె విమర్శించారు. మీరు ఒక్కటే మాట మాట్లాడుతున్నారని, తాము చెప్పేది వినడం లేదని అభిప్రాయపడ్డారు.
నన్ను ఆంటీ అన్న బొండా ఉమ పదహారేళ్ల కుర్రాడా, కాలేజీకి పోతున్నాడా అని ఎద్దేవా చేశారు. తనను ఐరన్ లెగ్ అని చెప్పి రాజకీయ సమాధి చేయాలని చూస్తున్నారన్నారు. దళిత నేతలతో మాపై మాట్లాడించి చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారన్నారు. జగన్ పెద్ద మనసుతో తనకు టిక్కెట్ ఇచ్చి, నన్ను గెలిపించారని, దీనిని టీడీపీ జీర్ణించుకోలేక పోతుందన్నారు.












Click it and Unblock the Notifications