సీమ జిల్లాలో జగన్ Vs చంద్రబాబు, మారుతున్న లెక్కలు - గెలుపెవరిది..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. అధికారం నిలబెట్టుకోవాలనేది సీఎం జగన్ లక్ష్యం. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ ఏపీలో ఆశలు పెంచుకుంటోంది. బీజేపీ 2014 తరహాలో పొత్తుకు సిద్దమేనా , కాదా అనేది స్పష్టత లేదు. ఈ సమయంలోనే సీమ జిల్లాల్లో సీఎం జగన్ పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే చంద్రబాబు, పవన్ కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు.
కొత్త సమీకరణాలు : 2019 ఎన్నికల్లో రాయలసీమ లో టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. కడప, కర్నూలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరు జిల్లాలో ఒక స్థానం మాత్రమే టీడీపీ గెలిచింది. తిరిగి ఈ ఎన్నికల్లో పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ పూర్వ వైభవం కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను బీసీలకే కేటాయిస్తూ వైసీపీ ఫార్ములా అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు దాదాపు రెండు పార్టీల నుంచి అభ్యర్దులను ఖరారు చేసారు. వైసీపీ నుంచి కర్నూలు ఎంపీతో పాటుగా ఆలూరు, ఎమ్మిగనూరు, నందికొట్కూరు స్థానాల్లో అభ్యర్దులను మార్పు చేసారు.

ఎవరికి ఎక్కడ : టీడీపీ నుంచి కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు సీట్లలో టీడీపీ నిలిపే అభ్యర్థులు దాదాపు ఖాయమయ్యారు. నందికొట్కూరులో జయరాజు, జయసింహ, కాకర్లవాడ వెంకట స్వామి పోటీలో ఉన్నారు. కోడుమూరులో కూడా ముగ్గురు రేసులో ఉన్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ కోట్ల వర్గానికి సన్నిహితుడు. ఆలూరుకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆమె కుటుంబానికి డోన్‌లో అవకాశం ఇస్తుండడంతో ఇక్కడి రేసు నుంచి ఆమె వైదొలిగారు. పార్టీ నేతలు వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతి, వైకుంఠం మల్లికార్జున ఇక్కడ పరిశీలనలో ఉన్నారు. డోన్ సీటును కోట్ల కుటుంబానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. కర్నూలుకు బీసీ నేతలు బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. నంద్యాల ఎంపీ సీటుకు బైరెడ్డి శబరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

హోరా హోరీ తప్పదా : జనసేన జిల్లా నుంచి రెండు సీట్లు ఆశిస్తుంది. ఆళ్లగడ్డ నుంచి రాంపుల్లారెడ్డి పేరు రేసులో ఉన్నా..అఖిలప్రియకు ఇవ్వటం పైనా ఇంకా టీడీపీ నిర్ణయం తీసుకోలేదు. అఖిలప్రియను పార్టీ పక్కన పెడితే ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఇక..వైసీపీ తిరిగి 2019 ఫలితాలు ఇక్కడ రిపీట్ చేస్తామని ధీమాగా ఉంది. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ బరిలోకి దించింది. కర్నూలు సీటు సిట్టింగ్ నే కొనసాగిస్తారా మార్చుతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఖాయమైతే కర్నూలు ఎంపీ సీటుతో సహా టీడీపీలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో, జిల్లాలో సత్తా చాటేందుకు వైసీపీ, టీడీపీ అధినేతలు సీఎం జగన్..చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications