జనసేనలోకి పవన్ ను ఓడించిన నేత..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. అనూహ్యంగా జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైసీపీని వీడి..టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీలు అదే బాట పట్టారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో వైసీపీ లో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు జనసేనతో టచ్ లోకి వెళ్తున్నారు. పవన్ ను ఓడించిన వైసీపీ నేత సైతం ఇప్పుడు జనసేన బాట పట్టినట్లు తెలుస్తోంది.
వైసీపీని వీడుతున్నారా
వైసీపీ ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు నేతలు పార్టీ వీడుతున్నారు. కోస్తా, గోదావరి జిల్లాల్లోని వైసీపీ నేతలు పలువురు ఇప్పటికే పార్టీ వీడగా..మరి కొంత మంది అదే బాటలో ఉన్నారు. గుంటూరు, ప్రకాశం, క్రిష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇక, ఇప్పుడు గోదావరి జిల్లాలో పార్టీల్లో చేరికలు మొదలవుతున్నాయి. గోదావరి జిల్లాల్లో జనసేన లో చేరేందుకు నేతలు మొగ్గు చూపుతున్నారు. గతంలో జనసేన నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన రాపాక వరప్రసాద్ సైతం వైసీపీ వీడాలని నిర్ణయించారు. ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది.

జనసేన వైపు చూపు
ఇక, 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ ను ఓడించిన వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ సైతం ఇప్పుడు పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో 2004 లో కాంగ్రెస్ నుంచి, 2019 లో వైసీపీ నుంచి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓడిపోయారు. ఓటమి తరువాత పార్టీకి.. రాజకీయ వ్యవహారాలకు గ్రంధి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో భీమవరం లో గ్రంధి శ్రీనివాస్ పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. భీమవరం లో భారీ మెజార్టీతో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
పవన్ అంగీకరిస్తారా
గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో పవన్ ను ఓడించిన తరువాత జగన్ మంత్రివర్గంలో తనకు ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ, మంత్రిగా అవకాశం దక్కలేదు. ఇప్పుడు పార్టీ ఓడటం.. జిల్లాలో మారుతున్న సమీకరణాలతో వైసీపీ వీడాలని నిర్ణయానికి వచ్చారు. జనసేనలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అయితే, గ్రంధి శ్రీనివాస్ గతంలో పవన్ ను ఓడించటం.. ఆ తరువాత ఆయన గురించి పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు జనసేనలో అదే నేతను చేర్చుకుంటే విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందనే వాదన ఉంది. ఇటు వైసీపీ నేతలు గ్రంధి శ్రీనివాస్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఈయన విషయంలో పవన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications