వైసీపీ నుంచి బరిలో సామాన్యులు- ఆ ముగ్గురి ఆస్తులు ఎంతో తెలుసా..!!
ఈ సారి ఎన్నికల బరిలో సామాన్యులు పోటీ చేస్తున్నారు. ప్రదాన పార్టీల నుంచి కోటీశ్వరులు కీలక నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. అయితే, అనూహ్యంగా సొంత ఇల్లు కూడా లేని వారు సైతం ఎన్నికల బరిలో నిలిచారు. వీరి బ్యాంకు బ్యాలెన్సులో మూడు అంకెల నెంబర్ కూడా కనిపించటం లేదు. వైసీపీ నుంచి ఇదే రకమైన ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమ నామినేషన్లలో తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.
మైలవరం నుంచి
మైలవరంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా వైసీపీ నుంచి సార్జాల తిరుపతి రావు టికెట్ దక్కించుకున్నారు. తిరుపతి రావు మొత్తం ఆస్తి 4.20,766 రూపాయలుగా చూపించారు. చరాస్తుల విలువ రూ 1,89,642.

బ్యాంకు ఖాతాలో తొమ్మదివేల రూపాయాలతో పాటుగా ఒక బైక్ తిరుపతి రావుకు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. తిరుపతి రావు వద్ద రూ 1.65 లక్షల విలువైన బంగారం, చేతిలో రూ 15 వేలు ఉన్నట్లుగా వివరించారు. సామాన్యుడుగా ఉన్న తిరుపతి రావు..కుబేరుడైన టీడీపీ అభ్యర్ది వసంత కృష్ణ ప్రసాద్‌పై పోటీ చేస్తున్నారు. దీంతో, అక్కడ ఫలితం పైన ఆసక్తి నెలకొంది.
టిప్పర్ డ్రైవర్ గా
అనంతపురం జిల్లా శింగనమల అభ్యర్ది ఎం వీరాంజనేయులు పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక టిప్పర్ డ్రైవర్ వైసీపీ నుంచి పోటీలో ఉన్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అనూహ్యంగా వీరాంజనేయులు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం స్థిర,చరాస్తులకు సంబంధించి కేవలం 1,06,478 రూపాయలు మాత్రమే ఉన్నాయి.
చేతిలో 50 వేల రూపాయలతో పాటు ఎస్‌బీఐలో 11,193 రూపాయలు, అలాగే ద్విచక్ర వాహనం మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్దిగా తల పడుతున్నారు. నామినేషన్ కు సైతం టప్పిర్ లోనే వచ్చారు.
పేద అభ్యర్దిగా బరిలోకి
మడకశిర రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్దిగా లక్కప్ప పోటీ చేస్తున్నారు. ఆయన వద్ద ఎలాంటి స్థిర చరాస్థులు లేవు. ఆయన వద్ద కేవలం2,783 రూపాయాలు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు. కెనరా బ్యాంకు ఖాతాలో 11 రూపాయలు కెనరా బ్యాంకులో 41 రూపాయి ఏడీసీసీ బ్యాంకులో రూ. 26,950 రూపాయలు యూనియన్ బ్యాంకులో రూ. 881తో పాటు అప్పులు రూ.1,13,050 ఉన్నట్లు తెలిపారు.
ఇందులో బ్యాంకు రుణం రూ. 86,100 కాగా, ఇతర అప్పులు రూ. 26,950 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా స్థిర చర ఆస్తులు కలిపి రూ. 99,883 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెస్ రాజు పైన లక్కప్ప పోటీ చేస్తున్నారు. దీంతో..ఈ ముగ్గురి ఎన్నికల ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications