ఏపీలో కులాల సర్వే ప్రారంభం-దేశంలోనే రెండో రాష్ట్రం- వచ్చే ఎన్నికల్ని తేల్చే లెక్క ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి కులాల సర్వే ప్రారంభిస్తోంది. వాలంటీర్లను ఇంటింటికీ పంపి కులాల వివరాలతో పాటు సామాజిక పరిస్ధితులను కూడా తెలుసుకోబోతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఎంపిక చేసి ఐదు ప్రాంతాల్లో ఈ సర్వే మొదలుకాబోతోంది. అనంతరం క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల వ్యవధిలో ఈ సర్వేను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బీహార్ తర్వాత కులాల సర్వే నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లో చోటు సంపాదిస్తోంది.

ఏపీలో కులాల సర్వే కోసం ప్రభుత్వం కొన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి అన్ని కలెక్టరేట్లలో కుల సంఘాల ప్రతినిధులు, మేథావులు, విద్యావంతుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోబోతోంది. వారు ఇచ్చిన సలహాల ఆధారంగా కులాల సర్వే అమలులో మార్పులు, చేర్పులు చేయబోతోంది. అలాగే ఈ నెల 17న అంటే ఎల్లుండి రాజమండ్రి, కర్నూల్లో, 20న విశాఖ, విజయవాడల్లో, 24న తిరుపతిలో కులాల సర్వేపై ప్రాంతీయ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తోంది.
అదే సమయంలో ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ఎంపిక చేసిన ఐదు గ్రామ సచివాలయాల పరిధిలో కులాల సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టబోతోంది. ఇక్కడ ఎదురైన అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వేను విస్తరిస్తారు. ఇలా రెండు నెలల్లో కుల గణనను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ లెక్కన జనవరి చివరి నాటికి ఈ సర్వే పూర్తి కావడం ఖాయం. అంటే సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఈ సర్వే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఇప్పటికే బీహార్ లో జరిగిన కులాల సర్వే ఫలితాల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేలు జరగాలన్న చర్చ పెరుగుతోంది. దీంతో విపక్ష ఇండియా కూటమి కూడా తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపడతామన్న హామీ ఇస్తోంది. దీని ప్రభావం ఇప్పటికే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అలాగే గతంలో బీహార్ లో నిర్వహించిన సర్వేకు సుప్రీంకోర్టు కూడా అభ్యంతరాలు చెప్పకపోవడంతో కేంద్రంలో బీజేపీ కూడా ఇరుకున పడింది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న వైసీపీ ఏపీలో కులాల సర్వే పూర్తి చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా వచ్చే ఎన్నికలపై పడుతుంది.












Click it and Unblock the Notifications