కుప్పంలో టీడీపీకి పరోక్షంగా సహకరిస్తోన్న వైసీపీ?
వచ్చే ఎన్నికలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా కీలకమే. ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో హోరాహోరీ యుద్ధం తప్పదని స్పష్టమవుతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్, ఈసారి అధికారంలోకి వచ్చితీరాలని చంద్రబాబు ఇద్దరూ తమ ఎన్నికల ప్రణాళికలను అమలు చేసుకుంటూ వస్తున్నారు.

ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్న వైసీపీ
కుప్పంలో చంద్రబాబును ఓడించగలిగితే టీడీపీపై సునాయాస విజయం సాధించవచ్చని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా కుప్పంలో కాలు మోపారు. జగన్ అడుగు పెట్టడానికి ముందు చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్న క్యాంటిన్ ధ్వంసమవడం.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు.. టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం లాంటివన్నీ జరగడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యం కుప్పం వార్తల్లో నానుతూనే ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం చంద్రబాబుకు ఓటమిని రుచిచూపిస్తామంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

ఆత్మరక్షణ ధోరణిలో చంద్రబాబు!
చంద్రబాబును ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసి కుప్పంపైనే ఎక్కువగా దృష్టిసారించేలా చేయగలిగితే రాష్ట్రమంతటా బాబు దృష్టిసారించడం తగ్గుతుందని, అన్యమనస్కంగానే ప్రచారం చేస్తారని, దీన్ని తమకుఅనుకూలంగా మలచుకొని పైచేయి సాధించి రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలనే యోచనలో జగన్ ఉన్నారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కుప్పంలో తరుచుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మొదటి నుంచి ఒక వ్యూహం ప్రకారం వైసీపీ అక్కడ పనిచేసుకుంటూ వస్తోంది. టీడీపీలో స్థానికంగా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకొని స్థానిక సంస్థలను కైవసం చేసుకోగలిగింది.

పోరాట స్ఫూర్తిని నింపుతున్న వైసీపీ?
కుప్పంలో వైసీపీ టీడీపీకి పరోక్షంగా సహకరిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ఏకపక్షంగా గెలుస్తున్నారు. ఇప్పటివరకు టీడీపీ శ్రేణులకు ప్రత్యర్థులపై పోరాడాల్సిన అవసరం రాలేదు. ఈసారి అటువంటి అవకాశం వారికి లభించింది. ఎప్పుడైతే వైసీపీ రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించిందో అప్పటి నుంచే చంద్రబాబు వీటిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. కుప్పంలో పార్టీని పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు పోరాటం తెలియని టీడీపీ శ్రేణులకు వైసీపీ పోరాటం నేర్పించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కుప్పంలో ఎలా పోరాడాలో తమకు చూపించిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఆరునెలల నుంచి కుప్పంలోని టీడీపీ శ్రేణులు ఒకరకమైన కసితో అంతర్గతంగా పనిచేయడం ప్రారంభించాయి. జైలు నుంచి విడుదలైన నాయకులు ఢీ అంటే ఢీ అనడానికి తాము సిద్ధమేనంటున్నారు. ఆరునెలల నుంచి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. వైసీపీ టీడీపీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడేంతవరకు కుప్పానికి సంబంధించిన ఉత్కంఠ అలాగే ఉంటుందనేది మాత్రం స్పష్టమవుతోంది.