ఏకిపారేసిన వైఎస్ అవినాష్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అదే సమయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై పార్టీ క్యాడర్ కు పలు సూచనలు చేశారు. దీనిపై ఓ కన్నేసి ఉంచాలని అన్నారు.
పులివెందులలో వైఎస్ఆర్సీపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఇందులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తోందంటూ మండిపడ్డారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా? అని నిలదీశారు. బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలను అవినాష్ రెడ్డి తప్పుపట్టారు. అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చని, ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదని, ఎదురుదాడికి దిగుతారని అవినాష్ రెడ్డి విమర్శించారు.
గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని చెప్పిన టీడీపీ కూటమి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయట్లేదని ప్రశ్నించారు. దీని గురించి జగన్ ప్రశ్నిస్తే జవాబు రావట్లేదని అన్నారు. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
వైయస్ఆర్ జిల్లాలో బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు దోచుకుంటున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ ను తిడితేనే వారికి రాజకీయంగా మనుగడ ఉంటుందనే భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తామని తేల్చి చెప్పారు. బీటెక్ రవి ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడని, అలాంటిది వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో అని హెచ్చరించారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లాడని, జగన్ ఒప్పుకొంటే వైఎస్ఆర్‌సీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యాడని తెలిపారు. తాము నిరాకరిస్తే సీఎం రమేష్‌ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?..అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, ఇలాంటి వారందరికీ అధికారంలోకి రాగానే తగిన సమాధానం చెబుతామని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications