పరిషత్ పదవులపై జగన్ కీలక నిర్ణయం- సామాజిక న్యాయం- ఎమ్మెల్యే కులానికి నో
ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పదవుల పంపకాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అధికార వైసీపీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పదవుల పందేరం చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో జనాభా పరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ అవకాశాలు దక్కనివారికి లబ్ది చేకూరబోతోంది.

సామాజిక న్యాయం దిశగా వైసీపీ అడుగులు
కులాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీలో అదే కులాల సమీకరణాలను ప్రయోగించడం ద్వారా ఆయా వర్గాల్లో తమ స్ధానాన్ని సుస్ధిరం చేసుకునే దిశగా వైసీపీ అడుగులేస్తోంది. రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ సాయంతో అద్భుత విజయాన్ని అందుకున్న వైసీపీ ఇప్పుడు స్ధానిక సంస్ధల విషయంలోనూ అదే ప్రయోగం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో తమకు రాజ్యాధికారం దక్కడం లేదని దశాబ్దాలుగా భావిస్తున్న పలు కులాలకు న్యాయం చేసే దిశగా వైసీపీ పలు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల తర్వాత చేసిన ప్రయోగాలను పరిషత్ పోరులోనూ అమలు చేసేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది.

పరిషత్ పదవులపై కీలక నిర్ణయం
త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో కుల సమీకరణాలకు పెద్దపీట వేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండల ప్రజాపరిషత్‌లో పదవుల విషయంలో గతంలో అవకాశాలు దక్కని వారికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ స్ధానిక ప్రజాప్రతినిధులు తమ కులాలకు చెందిన వారికి అవకాశాలు ఇప్పిస్తుండగా.. ఇప్పుడు దాన్ని మారుస్తూ ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులు ఎవరికి ఇవ్వాలో ఎన్నికలకు ముందే నిర్ణయించింది. ఈ విషయాన్ని స్ధానిక ప్రజాప్రతినిధులకు ముందుగానే స్పష్టం చేస్తోంది.

ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందని వారికే
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇచ్చే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల్లో ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందని వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు స్ధానిక ఎమ్మెల్యేల సామాజిక వర్గం వారికి ఈసారి అవకాశం దక్కడం లేదు. ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యంతో ఈ పదవులను తమ అనుచరులకు, సామాజిక వర్గం వారికి ఇప్పించుకుంటుండగా.. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఈ పదవులు ఇతర సామాజిక వర్గాలకు దక్కబోతున్నాయి.

పరిషత్ పదవుల్లో వీరికే ఛాన్స్
ప్రతీ మండలంలో సదరు నియోజవర్గం ఎమ్మెల్యే సామాజిక వర్గం తర్వాత అధికంగా ఉండే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీపీ పదవి ఇవ్వబోతున్నారు. అలాగే ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఉపాధ్యక్ష పదవి ఇస్తారు.
తద్వారా మండల స్ధాయిలో దాదాపు జనాభాపరంగా ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలకు కచ్చితంగా పదవులు దక్కబోతున్నాయి.
ఈ మేరకు ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినందున ఎంపీపీలు, ఉపాధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేయాలో ఎమ్మెల్యేలకు ముందుగానే సూచించడం ద్వారా వారికి వెసులుబాటు ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications