రేషన్ బియ్యంపై నోరువిప్పిన ద్వారంపూడి-సంచలన వ్యాఖ్యలు-ఎమ్మెల్యేకు 5 లక్షలు..!
ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న కాకినాడ పోర్టు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు విప్పారు. తన కుటుంబం బియ్యం అక్రమ రవాణా చేస్తోందంటూ వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు అసలు రేషన్ బియ్యం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో ఆయన చెప్పేశారు. ఈ వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్దికమంత్రి పయ్యావుల కేశవ్ నూ లాగారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాతో తనకు, తన కుటుంబానికి సంబంధము లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గతంలో కాకినాడ పోర్టుతో పాటు వివిధ పోర్టుల నుంచి విదేశాలకు బియ్యం రవాణా జరిగేదని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ పోర్టు నుంచి 98 శాతం బియ్యం రవాణా అయ్యేలా చేశామని, దీని వల్ల కాకినాడలో ఎంతో మంది లారీ ఓనర్లు బాగుపడ్డారన్నారు.

తన తమ్ముడు బియ్యం ఎగుమతి చేస్తాడని ద్వారంపూడి తెలిపారు. ఏపీలో పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యం ఎగుమతి చేయడం లో నెంబర్ 1 అని ద్వారంపూడి వెల్లడించారు. రేషన్ బియ్యం సప్లై చేసే వాళ్ళ దగ్గర స్థానిక ఎమ్మెల్యే 5 లక్షలు తీసుకుంటున్నాడని, అందుకే పవన్ కళ్యాణ్ దీనిపై ఇంతగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. కాకినాడ బియ్యం రవాణాపై సిట్ విచారణ వేయాలని, దానికి అభ్యంతరం లేదని ద్వారంపూడి తెలిపారు. ఆరు నెలల నుంచి రేషన్ బియ్యం ఎందుకు కంట్రోల్ చేయలేక పోయారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
రేషన్ బియ్యం చాలా చిన్న వాళ్ళు ఎగుమతి చేస్తారని, ఎగుమతిదారులకి దీంతో సంబంధము ఉండదని ద్వారంపూడి తెలిపారు. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలన్నారు. రేషన్ బియ్యం పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని, తమ కుటుంబం రేషన్ రైస్ వ్యాపారం లో లేదని ద్వారంపూడి వెల్లడించారు. గతంలో తాము బియ్యం వ్యాపారంలో ఉన్నామని, ఏ మచ్చ లేదని తెలిపారు. కానీ ప్రస్తుతం రచ్చ చేసి బియ్యం ఎగుమతులను నాశనం చేసేసారని ద్వారంపూడి వాపోయారు.
కరోనా సమయంలో కాకినాడ నుంచి బియ్యం వెళ్లకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోయేవన్నారు. గతంలో ఢిల్లీ సింగపూర్, బీహార్ నుంచి ఎగుమతి దారులు ఇక్కడికి వచ్చేవారన్నారు.












Click it and Unblock the Notifications