Jogi Ramesh: జోగి రమేశ్ కు భారీ ఊరట..! హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ (jogi ramesh) కు ఇవాళ భారీ ఊరట లభించింది. ఈ కేసులో జోగి రమేశ్ ను అరెస్టు చేసి విచారించేందుకు సిద్దమవుతున్న పోలీసులకు ఇవాళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ నేత జోగి రమేష్ కు హైకోర్టు మధ్యంతర ఊరట ఇచ్చింది. నారా లోకేష్ పై వ్యాఖ్యల కేసులో రికార్డులో ఉన్న విషయాలను ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత, పిటిషనర్ జోగి రమేష్.. మీడియా సమావేశంలో చేసిన ప్రకటనల నుండి ఈ ఆరోపణలు వచ్చాయని తెలిపింది. ఇవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం అతని ప్రాథమిక వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును వినియోగించుకోవడంలో భాగంగానే ఉన్నట్లు గుర్తించింది.

జోగి రమేశ్ పై పోలీసులు నమోదు చేసిన కేసులో ఆరోపించిన నేరాలకు ఏడు సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష విధించే అవకాశం ఉండటం, ఈ దశలో కస్టడీ విచారణకు తక్షణ అవసరం లేదని భావించిన న్యాయస్థానం.. ఆయనకు పరిమిత మధ్యంతర రక్షణ అవసరమని పేర్కొంది. దీని ప్రకారం, తదుపరి విచారణ తేదీ వరకు పిటిషనర్ జోగి రమేశ్ పై ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోరాదని పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జోగి రమేష్ కు ఈ నెల 27 వరకూ అరెస్టు నుంచి రక్షణ లభించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications