బాబు ఐదేళ్లే.. మరి మీరు..! కల్తీ మద్యం కేసుపై జోగి మరో ట్విస్ట్..!
ఏపీలో కల్తీ మద్యం వ్యవహారంలో ఓవైపు నిందితులు వైసీపీ నేత జోగి రమేశ్ పేరును విచారణలో చెప్తుంటే.. మరోవైపు ఆయన మాత్రం తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటపడతాయంటున్నారు. కల్తీ మద్యం కేసుపై ఇప్పటికే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రమాణం కూడా చేసిన జోగి రమేశ్.. ఇవాళ మరోసారి ప్రభుత్వం తనను టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టారు.
ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులను స్వయంగా చూశానని, ఆ దృశ్యాలను ప్రజల ముందుకు తెచ్చానని జోగి రమేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా నకిలీ మద్యం సరఫరాను నిలదీయడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరాను ప్రశ్నిస్తూ, నేను నివాసం ఉండే ఇబ్రహీంపట్నంలో ఆ మద్యం తయారీని లోకానికి చూపడం నేరమా? దాంతో నాపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్..ఇద్దరూ నా జీవితంతో పాటు, వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారన్నారు.

డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా నకిలీ మద్యం కేసును తనపై మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తానెప్పుడూ నకిలీ మద్యం తయారు చేయించలేదని, అలాంటి పని తానెప్పుడూ చేయనని స్పష్టం చేశారు. ఈ కేసులో వాస్తవాలు తేలాలంటే సీబీఐ దర్యాప్తు కు సీఎం చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. నకిలీ మద్యం విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడం కోసం సీబీఐ దర్యాప్తు, లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలసిస్ టెస్ట్ దేనికైనా సిద్ధమన్నారు. కావాలంటే కుటుంబంతో సహా తిరుమల వచ్చి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద ప్రమాణం చేస్తానన్నారు.

జనార్థన్ రావు అనే వ్యక్తి రిమాండ్‌లో ఉన్న సమయంలో వీడియోలు, ఫేక్ చాట్స్, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది అత్యంత దారుణమని జోగి రమేశ్ విమర్శించారు. నిజానికి ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో తన పేరు లేదన్నారు. అయినా సరే మీడియా ద్వారా తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగమే అన్నారు. దేవుడు, ప్రజలు సాక్షిగా తన నిజాయితీని నిరూపిస్తానన్నారు. చంద్రబాబునాయుడు శాశ్వతంగా ఆ పదవిలో ఉండరని, కానీ సిట్ అధికారులు సర్వీస్ ఉన్నంత కాలం, ఉద్యోగం చేసేంత వరకూ ఆ బాధ్యతలో ఉంటారు కాబట్టి దయచేసి తప్పు చేయవద్దన్నారు. నిజాయితీగా విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలన్నారు












Click it and Unblock the Notifications