విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి పోటీ? కేశినేని నాని కీలక వ్యాఖ్యలు..!
ఏపీలోని విజయవాడ లోక్ సభ సీటు పరిధిలో ఈసారి రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీని వీడి వైసీపీలో చేరిన కేశినేని నాని వచ్చే ఎన్నికలకు ఆ పార్టీ నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. అదే సమయంలో సిటీలోని కీలకమైన విజయవాడ పశ్చిమ సీటులో వైసీపీ వ్యూహాలకు కౌంటర్ గా ఎన్డీయే విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో నాని ఇవాళ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయవాడ పరిధిలో ఈసారి ఎన్నికలు అంత ఆషామాషీ కాదని తేలిపోతోంది.
వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఈసారి తాము పోటీ చేసే ఆరు లోక్ సభ సీట్లకు తాజాగా అభ్యర్ధుల్ని ప్రకటించింది. రేపో మాపో 10 అసెంబ్లీ సీట్లకు కూడా అభ్యర్ధుల ప్రకటనకు సిద్దమవుతోంది. అయితే లోక్ సభకు పోటీ చేస్తారని భావించిన మాజీ ఎంపీ సుజనా చౌదరికి కాషాయ పార్టీ ఎక్కడా సీటు కేటాయించకపోవడంతో ఆయన్ను అసెంబ్లీ బరిలోకి దించబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీ తరఫున సుజనా చౌదరి బరిలోకి దిగుతారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కూటమి పార్టీలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. కానీ విజయవాడ ఎంపీగా ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న కేశినేని నాని మాత్రం దీనిపై ఘాటుగా స్పందించారు. విజయవాడ పశ్చిమ సీటు అయితే ముస్లింలకు, లేదా బీసీలకు ఇవ్వాలని తాను టీడీపీలో ఉన్నప్పటి నుంచీ చెబుతున్నానని గుర్తు చేసుకున్నారు. జనసేన బీసీ నేత పోతిన మహేష్ ను కాదని, ఛార్టర్డ్ ఫ్లైట్ లలో తిరిగే వారికి టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతే కాదు రెండేళ్ల పాటు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికీ ఏమీ చేయని వ్యక్తిని ఇక్కడ తిరిగి ఎలా నిలబెడతారంటూ ఎన్డీయే పార్టీల్ని కేశినేని నాని ప్రశ్నిస్తున్నారు. వ్యవస్ధల్ని మేనేజ్ చేసే వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ సొంత పార్టీ వైసీపీ నాయకులకు కేశినేని నాని సూచించారు.












Click it and Unblock the Notifications