తోతాపురి కుట్ర వెనుక పెద్దిరెడ్డి ? మంత్రి అనగాని సీరియస్ వార్నింగ్ ..!
ఏపీలోని చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి పళ్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కాస్తా రాజకీయ రంగు పులుముకున్నట్లే కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మార్కెట్ యార్డ్ లో తోతాపురి మామిడి రైతుల్ని కలిసేందుకు ఎల్లుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్కడికి వస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే తోతాపురి రైతుల కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం..అంతకు మించి కారణాలపై ఆరా తీస్తోంది.
ఇందులో భాగంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి పళ్ల సంక్షోభం నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్ స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మామిడి రైతుల్ని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మోసం చేస్తోందని ఆరోపించారు. మామిడి గుజ్జు పరిశ్రమలను పెద్దిరెడ్డి కుటుంబం శాసిస్తోందని తమకు ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులను సిండికేట్‍గా మార్చారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై పెద్దిరెడ్డి కుట్ర చేస్తున్నారని తెలిపారు. రైతులు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే వదిలిపెట్టబోమని మంత్రి అనగాని సత్యప్రసాద్ పెద్దిరెడ్డిని హెచ్చరించారు. ఎల్లుండి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్ కు ఇవాళ అనుమతి ఇచ్చిన ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. మార్కెట్ యార్డ్ లో స్థలం తక్కువగా ఉన్నందున కేవలం 500 మందే రావాలని, హెలిప్యాడ్ వద్దకు 30 మందినే అనుమతిస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications