టీడీపీకి తగ్గుతున్న 10 వేల ఓట్లు
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఘాటు విమర్శలు సంధించారు. తమ పార్టీని, ప్రభుత్వాన్ని రోజూ తిట్టించడమే పనిగా పెట్టుకున్నారని, ఎలాంటి లోపాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తోండటం వల్ల ప్రభుత్వంపై అంశాలపరంగా విమర్శలు చేయలేక చేతులెత్తేశారని అన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు. పనికిమాలిన వ్యక్తులతో ప్రెస్‌మీట్లు పెట్టించితమ ప్రభుత్వాన్ని తిట్టించడం ద్వారా టీడీపీ 10 వేల ఓట్లను తగ్గించుకుంటోందని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతున్నాడని, అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా.. తమ పార్టీ అంతు చూస్తామంటూ బీరాలు పలుకుతున్నాడని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ దివాళా తీసిందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏరోజూ మంచి చేయలేదని ఆరోపించారు. ఫలితంగా 23 స్థానాలకే టీడీపీ పరిమితమైనప్పటికీ- చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవట్లేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని గుర్తు చేశారు. తమ పార్టీని ఎంతగా బురదచల్లాలని చూసినా, అది వారి మీదే పడుతుందని అన్నారు.
చంద్రబాబు సొంతంగా ఏ ఎన్నికలకు వెళ్లలేడని, ఒక్కడిగా వెళ్లి ప్రజలను ఓట్లు అడగలేడని రవిచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. పొత్తు ఉంటే తప్ప ఎన్నికలను ఎదుర్కోలేని పిరికి మనస్తత్వం చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే 2014-19 మధ్యకాలంలో తన ప్రభుత్వంలో చేసిన మంచి పనులను చెప్పి.. ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ప్రజలకు మేలు చేస్తోన్న తమ ప్రభుత్వాన్ని తిడితే టీడీపీ భవిష్యత్తే ఉండదని విమర్శించారు.

చంద్రబాబు, నారా లోకేష్ చేస్తోన్న ఆరోపణలు ఎల్లో మీడియా, వారికి బాకాలు ఊదే కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు వినసొంపుగా ఉండొచ్చేమో గానీ ప్రజలు మాత్రం చీదరించుకుంటోన్నారని రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. తండ్రీకొడుకులిద్దరూ కూడా సమాజానికి పనికొచ్చే వ్యక్తులు కానే కాదని ఎద్దేవా చేశారు. 14 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు తన పరిపాలన కాలాన్ని చూపి ఓట్లను ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications