తప్పు చేయకపోతే భయం ఎందుకు: టీడీపీకి సజ్జల సూటి ప్రశ్న
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణను కొనసాగించడంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దీనితో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇక మళ్లీ పట్టాలెక్కబోతోంది.
తన ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారనేది చంద్రబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారణ జరిపించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై స్టే మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ ఉదయం తన ఆదేశాలను వెలువడించింది.

దీనిపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. తమ ప్రభుత్వానికి దక్కిన భారీ విజయం అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావొచ్చు.. ఇంకెవరి ప్రభుత్వమైనా కావొచ్చు..విధాన పరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే అది ముమ్మాటికి తప్పే అవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన తప్పుడు నిర్ణయాలు, రాష్ట్రానికి కీడు కలిగించే చర్యలను ఆ తరువాత వచ్చిన సమీక్షించకపోవడం కూడా తప్పే అవుతుందని సజ్జల చెప్పారు. సమీక్షించడం అనేది- ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కనీస బాధ్యతగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తే భయపడాల్సిన అవసరం వారికి లేదని సజ్జల అన్నారు.

సిట్‌ను తాము ఏదో కక్షసాధింపు చర్యగా నియమించలేదని, అసెంబ్లీలో పూర్తిగా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. చట్టసభలో చర్చించిన తరువాత తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సవాల్ చేయడం అనేద దుస్సాహసమని, అక్కడే వారి భయం కనిపిస్తోందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం రాజధాని అమరావతి పరిధిలో చోటు చేసుకుందని, దీన్ని బయటపెట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు దోహదపడతాయని అన్నారు.
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదని, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశాడని సజ్జల చెప్పారు. భూసేకరణ కూడా పూర్తి చేయలేదని, రైతులకు ఎలాంటి పరిహారాన్ని అప్పట్లో ప్రకటించలేదని చెప్పారు. పిలిచిన టెండర్లను ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం భూములను సమీకరించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, గ్రంధి మల్లికార్జున రావు కూడా ఇదే విషయం చెప్పారని అన్నారు.












Click it and Unblock the Notifications