ప్రత్యేక హోదా వల్ల ఇవి ప్రయోజనాలు: జగన్ పార్టీ నేత వాదన ఇదీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరికి, హోదా వస్తే ప్రతి గ్రామం హైదరాబాద్ అవుతుందనేది సరికాదని చెప్పిన కేంద్రమంత్రి, టిడిపి నేత వెంకయ్యకు సోమవారం నాడు వైసిపి కౌంటర్ ఇచ్చింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను ఏకరువు పెట్టారు. బుగ్గన మాట్లాడుతూ.. ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు హోదా విషయంలో తరుచూ మాట మారుస్తూ చివరికి హోదా వల్ల లాభాలు ఏమిటో చెప్పాలని, నన్ను ఎడ్యుకేట్ చేయాలని అంటున్నారని, అయితే హోదాతో మాత్రం చాలా లాభాలున్నాయని చెప్పారు. హోదా వల్ల ఏపీకి చాలా లాభాలు ఉంటాయన్నారు.
లాభాల గురించి ఆయన ఇలా చెప్పారు.
కేంద్రానికి ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ సుంకాల ద్వారా ఆదాయంలో సుమారు 60 నుంచి 62 శాతం ఆదాయాన్ని రాష్ట్రానికి నిధులుగా ఇస్తుంది. ఇవి కాక గ్రాంట్లు, రుణాలు కూడా విడిగా వస్తాయి.
మామూలు రాష్ట్రాన్నింటికి కలిపి 70 శాతం ఉంటే, హోదా ఉన్న రాష్ట్రాలకు 30 శాతం అందుతుంది. జనాభా శాతాన్ని బట్టి చూస్తే 6 లేదా ఏడు శాతం జనాభా ఉండే హోదా రాష్ట్రాలకు 30 శాతం సాయం వస్తుంది.

ఇది కాక ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సహాయంలో 90 శాతం గ్రాంటు రూపంలోను, పది శాతం అప్పుగాను ఉంటుంది. మామూలు రాష్ట్రాలకు 30 శాతం గ్రాంటు రూపంలో, 70 శాతం అప్పు రూపంలో ఉంటుంది.
పరిశ్రమలు పెడితే కేంద్ర ఎక్సైజ్ పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. ఆ మినహాయింపు కూడా సెన్ వ్యాట్ ఇన్‌పుట్ క్రెడిట్‌గా పరిశ్రమ తీసుకోవచ్చు. అంటే ఒ పరిశ్రమలో రూ.100 విలువైన ఉత్పత్తి చేస్తే రూ.12వేలు కేంద్ర ఎక్సైజ్ పన్ను కట్టకపోగా అమ్మేటప్పుడు ఆ రూ.12వేలు కూడా ఇన్‌పుట్ క్రెడిట్‌గా తీసుకోవచ్చు. దీని వల్ల వస్తువుల ధరల్లో ఎంతో తేడా వస్తుంది.
వందశాతం ఆదాయపు పన్ను శాఖ కట్టనవసరం లేదు. అంతేకాకుండా కొన్నేళ్ల తర్వాత ఆదాయపు పన్నులో రిబేటు కూడా తీసుకునే అవకాశముంటుంది. ఇంకా పెట్టుబడి పైన కేంద్రం 30 శాతం సబ్సిడీ ఇస్తుంది.
బీమా ప్రీమియం మొత్తం వెనక్కి వస్తుంది. ఉదాహరణకు రూ.100 కోట్ల పరిశ్రమ ఏడాదికి ఏడాదికి రూ.కోటి బీమా చేస్తే ఆ ప్రీమియం మొత్తం వెనక్కి ఇస్తారు.
పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడి సరుకుని తీసుకు వెళ్లేందుకు, తయారైన వస్తువులను పంపేందుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా కేంద్రం చెల్లిస్తుంది.
బుగ్గన ఇంకా మాట్లాడుతూ... చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని అంటున్నారని, ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఈశాన్య రాష్ట్రాలలో ఎంత దుర్భరమైన వాతావరణం ఉంటుందో తెలియదా, హోదా ఇవ్వకపోతే అసలు అక్కడి ప్రజలు మనుగడ సాగించగలరా, హోదా ఉంది కాబట్టే వాళ్లు ఆ మేరకైనా బతకగల్గుతున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications