ఏం చేద్దాం: జగన్ భేటీ, రోజా హాజరు, 9 మంది డుమ్మా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రేపటి నుంచి (గురువారం) అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించనున్న విధి విధానాలపై చర్చిస్తున్నారు.
ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసన సభా సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగంపై చర్చ, ముఖ్యమైన గత ప్రజా సమస్యల ప్రస్తావన వంటి అంశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీకి నగరి ఎమ్మెల్యే రోజా తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశానికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాల వల్ల హాజరు కాలేదు. రవీంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, రాజన్న దొర, రాజేశ్వరి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సంజీవయ్య, రఘురాం రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, సి రామచంద్రా రెడ్డి ఉన్నారు.

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సునీత, గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని పరిటాల సునీత చెప్పారు. బుధవారం ఉదయం మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. పేదలకు అన్నం పెట్టే కీలక శాఖ అప్పగించి తనకు సముచిత స్థానం కల్పించారన్నారు. పరిటాల రవి మరణం తర్వాత పడరాని కష్టాలు పడ్డానన్నారు. అయితే, కష్ట సమయంలో పార్టీ తనకు అండగా నిలిచిందని పరిటాల సునీత అన్నారు.
హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ఉదయం గంటా శ్రీనివాస రావు బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటాను కలిసిన పలువురు మంత్రులు, అధికారులు అభినందనలు తెలిపారు. మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications