సంచలన నిర్ణయం దిశగా వైసీపీ ఎమ్మెల్యే - సీఎంను కలిసాక ప్రకటిస్తా: మరో వర్గం అయితే దాడికి దిగేవారా..!!
వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకుంటానంటూ హెచ్చరించారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావించిన ఆయన త్వరలోనే సీఎంను కలుస్తానని చెప్పారు. ఆయనతో సమావేశం తరువాత సంచలన నిర్ణయం తీసుకుంటానని చెప్పటం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఒంగోలు వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా.. పార్టీ నేతల పైన వ్యాఖ్యలు...ఆయన పైన దాడి అంశం పైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు.

ఎమ్మెల్యే రాంబాబు వ్యాఖ్యల వెనుక
గుప్తాపై జరిగిన దాడిని ఖండించారు. మంత్రి కొడాలి నాని..అంబటి రాంబాబు.. వల్లభనేని వంశీల కారణంగా వైసీపీ నష్టపోతోందంటూ గుప్తా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరువాత సుభానీ అనే వ్యక్తి గుంటూరులోని లాడ్జీలో ఉన్న గుప్తా పైన దాడి చేసారు. ఆ సన్నివేశాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. ఈ ఘటన పైన స్పందించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. సుబ్బారావు గుప్తాపై సుభానీ దాడిచేయడమే కాక పరుష పదజాలంతో దూషించడం సరైన పద్ధతి కాదని చెప్పారు.

ఆ సామాజిక వర్గం కావటంతోనే దాడి
కేవలం వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే సుభానీ దాడి చేశారంటూ వ్యాఖ్యానించారు. అదే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిపై సుభానీ దాడి చేయగలరా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సుభానీ.. స్వామి భక్తితో చేశారో, లేక ఏదైనా మనసులో పెట్టుకుని, నాయకుడు కావాలనే స్వార్థంతో దాడిచేశారో అంటూ కామెంట్ చేసారు. న్యాయస్థానం ఉంది, చట్టాలున్నాయి తగిన ..మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. సుబ్బారావు గుప్తా కూడా తన స్థాయికి మించి మాట్లాడటం, విమర్శించడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

బాలినేనికి ఇబ్బంది కలిగిస్తాయి
పార్టీలో కార్యకర్తల మద్య జరిగిన వ్యవహారాలకు కులాలను.. మతాలను ఆపాదించటం సరి కాదంటూ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మంత్రి బాలినేనికి ఇబ్బంది కలిగిస్తాయంటూ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. పార్టీలో ఉన్నవారిని గౌరవించాలని సూచించారు. ఇక, గిద్దలూరు రాజకీయ పరిస్థితులపైన సీఎం జగన్ ను కలవనున్నట్లు చెప్పారు. సీఎంను కలిసిన తరువాత సంచలన నిర్ణయం తీసుకుంటానంటూ ఎమ్మెల్యే రాంబాబు చెప్పుకొచ్చారు. ఆ సంచలన నిర్ణయం ఏంటనేది ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమైంది.

సీఎంతో సమావేశం తరువాత సంచలన నిర్ణయం
2009లో ప్రజారాజ్యం నుంచి గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచిన రాంబాబు.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అశోక్ రెడ్డి టీడీపీకి దగ్గర కావటంతో..తిరిగి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలతో..గిద్దలూరులోనే కాకుండా ప్రకాశం జిల్లా. .వైసీపీలో అన్నా రాంబాబు భవిష్యత్ నిర్ణయం ఏ రకంగా ఉంటుందనే చర్చ సాగుతోంది. దీని పైన ఆయనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications