జోగి రమేష్ అరెస్ట్-మంగళగిరి పీఎస్ కు తరలింపు-ఉండవల్లిలో చల్లారిన ఉద్రిక్తత
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న మాటల యుద్దం కాస్తా ఇవాళ భౌతిక దాడుల వరకూ వెళ్లింది. విపక్ష నేత చంద్రబాబు టార్గెట్ గావైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇవాళ నిరసనకు దిగడంతో అక్కడ టీడీపీ నేతలతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జోగి రమేష్ ను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. పోలీసులు కూడా అడ్డుకున్నారు. చివరికి బలవంతంగా అరెస్టు చేసి మంగళగిరి పీఎస్ కు తరలించారు.
నిన్న అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇవాళ చంద్రబాబును దీనిపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ఆయన ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించారు. అయినా పోలీసులు ఆయన్ను చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లకుండా అడ్డుకోలేదు. దీంతో జోగి రమేషే నేరుగా చంద్రబాబు ఇంటివద్దకు చేరుకోవడం, అక్కడి వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇది కాస్తా రాళ్ల దాడుల వరకూ వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత తీరిగ్గా స్పందించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి మంగళగిరి పీఎస్ కు తరలించారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి జోగి రమేష్ వస్తానని ప్రకటించినా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన ఘటన కావడం, నేతల్ని అఢ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇది కాస్తా భౌతిక దాడుల వరకూ వెళ్లింది. ముఖ్యంగా టీడీపీ నేత బుద్దా వెంకన్నతో జోగి రమేష్ వాగ్వాదం తర్వాత పరిస్ధితిని అదుపు చేయడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. చివరికి పరిస్దితి ఉద్రిక్తంగా మారుతుందని తెలిసినా పోలీసులు చాలా సేపటి వరకూ జోగి రమేష్ ను అక్కడి నుంచి పంపలేకపోయారు. ఆయన కారు అద్దం కూడా ధ్వంసం అయిన తర్వాత కూడా చాలా సేపు ఆయన అక్కడే ఉన్నారు. చివరికి పోలీసులు మంగళగిరి పీఎస్ కు జోగి రమేష్ ను తరలించడంతో ఆయన టీడీపీ నేతలపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అటు టీడీపీ నేతలు కూడా జోగి రమేష్ పై కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications