అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి- కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తాను ఏనాడూ పరుషంగా మాట్లాడ లేదని చెప్పారు.
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోన్నారు. వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్ర ఉన్న ఆయన- మొన్నీ మధ్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జిల్లా అధికార యంత్రాంగంపై తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆయనను వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు.

ఫైర్ బ్రాండ్..
కోటంరెడ్డికి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తుంటారు. ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. రోజూ వార్తల్లో నిలుస్తుంటారు. తన వైఖరితో అధికార యంత్రాంగానికి చుక్కలు చూపిస్తుంటారు. పనులు చెయ్యని అధికారులపై ఎలాంటి మొహమాటం లేకుండా, విమర్శనాస్త్రాలను గుప్పించడానికీ వెనుకాడరు. అధికారుల వైఖరిని నిరసిస్తూ కొద్దిరోజుల కిందటే తన నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంట మురుగునీటి కాల్వలో బైఠాయించిన విషయం తెలిసిందే.

అభివృద్ధి పనులపైనా అదే వైఖరి..
జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలోనూ ఆయన అదే వైఖరిని ప్రదర్శించారు. అధికార యంత్రాంగంపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పైనా విమర్శలు గుప్పించారు. నిధులను సకాలంలో మంజూరు చేయట్లేదని, ఫలితంగా తన నియోజకవర్గం పరిధిలో రోడ్ల మరమ్మతు, ఇతర అభివృద్ధి పనులు స్తంభించి పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీకి గుడ్ బై..
తాజాగా ఆయన నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో ఎన్నో అవమానాలను తాను భరించానని, అలాంటి చోట కొనసాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వాటిని బయటపెడితే జగన్ ప్రభుత్వం కేంద్రానికి వివరణలు, సమాధానాలను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. దీనివల్ల ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు.

జగన్ పై నోరెత్తలేదు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గానీ, సొంత పార్టీ ప్రభుత్వపై గానీ- తాను ఏనాడు కూడా పరుషంగా మాట్లాడలేదని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు. బారాషాహి దర్గాకు వైఎస్ జగన్ నిధులను మంజూరు చేసినప్పటికీ.. దాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేయలేదని, ఆ ఫైళ్లను తొక్కి పెట్టారని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో తాను సొంత పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని, ఇక వాటిని భరించే శక్తి తనకు లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయని కోటంరెడ్డి అన్నారు.

నటన చేతకాదు..
తనకు నటించడం చేత కాదని, మోసం చేయడం రాదని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. తనకు నటన వచ్చివుంటే పార్టీలో కొనసాగే వాడినేనని అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ- పార్టీని వద్దని అనుకుంటున్నానని చెప్పారు. దీన్ని బట్టి తన నిజాయితీ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. 15 నెలల తరువాత ప్రజలు ఎలా తీర్పు ఇస్తారో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు.

వైసీపీ నుంచి పోటీ చేయను..
తనను అనుమానించిన, అవమానించిన పార్టీలో ఒక ఉండకూడదని నిర్ణయించుకున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని నేరుగా ఎవరికి చెప్పాలో.. వారికి చెప్పేస్తాననీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయకూడదని తన మనసు చెబుతోందని పేర్కొన్నారు. అందుకే బహిరంగంగా తాను మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. ప్రభుత్వానికి తాను ఎలాంటి చికాకులు తీసుకుని రాననీ అన్నారు.

మొన్నే వివరణ..
ఇటీవలే కోటంరెడ్డిని వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గానికి విడుదల చేస్తోన్న నిధుల లోటు లేనప్పటికీ- ఎందుకు అసంతృప్తి గళాన్ని బాహటంగా వినిపించాల్సి వచ్చిందనే విషయంపై జగన్ ఆరా తీశారు. దీనికి గల కారణాలను ఆయన ముఖ్యమంత్రికి వివరించారని, అధికార యంత్రాంగంపై చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చారు. అప్పటి నుంచీ పార్టీకి- కోటంరెడ్డికి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. తెగే దాకా వెళ్లింది.












Click it and Unblock the Notifications