పేర్ని వర్సెస్ కలెక్టర్ : ఒకరు సీఎస్ కు ఫిర్యాదు- మరొకరు సీఎంవోకు వివరణ..!
నిన్న కృష్ణాజిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ఇవాళ ఆయనపై సీఎస్ జవహర్ రెడ్డిని సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. మరోవైపు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా ఏపీ సీఎంవో అధికారుల్ని కలిసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.
జడ్పీ సమావేశానికి కలెక్టర్ గైర్హాజరుపై సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేసిన పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జిల్లాల విభజన చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీల్లో భాగంగా విభజన చేశారని తెలిపారు. అయితే అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవడంతో జెడ్పీ సర్వ సభ్య సమావేశాలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి సీఎంకు సర్వాధికారం ఎలా ఉందో.. అలాగే జిల్లాల్లో కలెక్టర్లకి అలాగే సర్వాధికారాలు ఉన్నాయన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయని, ఏలూరు జిల్లా నుంచి వ్యవసాయ జెడీఈ తప్ప హోదా ఉన్న అధికారులెవ్వరూ రాలేదని పేర్ని ఆరోపించారు. ఏలూరు జిల్లా నుంచి చిన్న అధికారులనో, గుమాస్తాలనో పంపారన్నారు. ఇలాగైతే ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేది ఎలా..? అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేయడం దేనికన్నారు.వచ్చే సమావేశాలకు ఏలూరు కలెక్టర్ రాకుంటే సీఎం జగన్ వద్ద కూర్చొంటానన్న మాట నుంచి వెనక్కు వెళ్లడం లేదన్నారు.నేనేదో ప్రభుత్వాన్ని, జగన్ను విమర్శించానని కొందరు అంటున్నారని, రాష్ట్ర పెద్దగా సీఎంగా ఉన్న జగనుకు కాకుండా ఇంకా ఎవరికి చెప్పుకుంటామన్నారు.
ఇందులో తానేమీ ప్రెస్టేజీకి పోవడం లేదని పేర్నినాని చెప్పుకొచ్చారు. ఆరు నెలల్లో రిటైర్డ్ అయ్యేవాడిని నాకేం ప్రెస్టేజ్ ఉంటుందన్నారు. అధికార పార్టీలో ఉన్నా వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తే తప్పా..? అని అడిగారు. నిన్ననే ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేషుతో మాట్లాడాననని, వ్యవస్థలకు భంగం కలగకూడదనే నేను మాట్లాడానని ప్రసన్న వెంకటేష్ కు చెప్పానన్నారు. జెడ్పీ సమావేశానికి హాజరు కావడం మాండేటరీ కాదు అని ఏలూరు కలెక్టరు అన్నారన్నారు. అదే కరెక్ట్ అయితే సరి చేయమని చెప్పడానికే సీఎస్సును కలిశానన్నారు. కలెక్టర్లు జెడ్పీ సమావేశాలకు రావాలని సీఎస్ స్పష్టం చేశారన్నారు. జెడ్పీ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలిస్తామన్నారని చెప్పారు.
మరోవైపు పేర్నినాని జడ్పీ సమావేశానికి తనను తప్పనిసరిగా హాజరుకావాల్సిందిగా కోరడంపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా ఇవాళ సీఎంవోకు వెళ్లి సంబంధిత అధికారులకు వివరణ ఇచ్చారు. ఏ పరిస్ధితుల్లో తాను జడ్పీ సమావేశాలకు వెళ్లడం లేదో వివరించారు. ఇప్పటికే కృష్ణా జిల్లా సమావేశానికి హాజరుకానవసరం లేదని పేర్ని కి చెప్పిన ఏలూరు జిల్లా కలెక్టర్..ఇవాళ ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications