రోజాకు నో ఎంట్రీ: 'నన్ను అడ్డుకుని న్యాయవ్వవస్థను కించపరచొద్దు'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో అసెంబ్లీలో ఉత్కంఠకు తెర లేచింది. ఏడాది పాటు సస్పెండ్‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు రోజా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. తన న్యాయవాదులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన ఆమె సభలోకి వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు.
అయితే రోజాను అసెంబ్లీలోకి అనుమతిస్తారా? లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రోజా వ్యవహారంపై జీరో అవర్ తర్వాత చర్చ జరుగుతుందని, ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే, రోజాను అడ్డుకోవాలన్న స్పీకర్ కార్యాలయం ఆదేశాలతో పెద్ద సంఖ్యలో మహిళా మార్షల్స్ కూడా అప్పటికే అసెంబ్లీ ఆవరణలో భారీ సంఖ్యలో మోహరించారు.

రోజాకు అసెంబ్లీ ఆవరణలోకి మాత్రమే అనుమతి ఉందని స్పీకర్ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలోకి అనుమతించమని ఓ పక్క ప్రభుత్వం చెప్పినా పట్టించుకోకుండా రోజా అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అసెంబ్లీలోని అన్ని గేట్ల వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తూ, చట్టసభలో తనకు అన్యాయం జరిగిన తర్వాత కోర్టుకు వెళ్లానని, అక్కడ న్యాయం జరిగిందని అన్నారు. కోర్టులో తనకు న్యాయం జరిగిందన్నారు. తన హక్కులను కాపాడు కోవడానికే న్యాయవ్వవస్ధను ఆశ్రయించానని చెప్పారు.
హైకోర్టు కాపీలను అసెంబ్లీ కార్యదర్శికి ముందే అందజేశానని ఆమె తెలిపారు. సభలో ఉన్నవాళ్లంతా చదువుకున్నవాళ్లేనని, ఆర్డర్ చదివితే మంత్రి యనమల రామకృష్ణుడికి, స్పీకర్‌కి అన్ని విషయాలూ తెలుస్తాయని అన్నారు. నన్ను అడ్డుకొని న్యాయవ్వవస్థను కించపరచొద్దని, ఏం జరుగుతుందో చూడాలని ఆమె వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి రోజా వచ్చిన సమయంలో ఆమె వెంట వైసీపీకి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఆమె సొంత జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఉన్నారు. ఏడాది పాటు రోజా సస్పెన్షన్ తీర్మానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావచ్చని కూడా జస్టిస్ రామలింగేశ్వరరావు తన మధ్యంతర ఉత్తర్వులలో పేర్కొన్న విషయం తెలిసిందే. రూల్ 320 ప్రకారం ఏ చట్ట సభ సభ్యుడిని కూడా ఏడాది పాటు సస్పెండ్ చేయడం కుదరదని కోర్టు చెప్పడంతో దీంతో రెట్టించిన ఉత్సాహంతో కోర్టు తీర్పు కాపీతో గురువారం సాయంత్రానికే రోజా అసెంబ్లీకి వచ్చారు.
అయితే అప్పటికే అసెంబ్లీ వాయిదా పడటంతో ఆమె వెనుదిరిగారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతానని తెలిపారు. ఆ ఉత్తర్వుల కాపీని గురువారమే అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణని కలిసి కోర్టు ఉత్తర్వులను అందజేశారు. ఉత్తర్వులు తనకు అందినట్లు ఆయన ఒక కాపీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications