చంద్రబాబు పాలనను ప్రవాస భారతీయులు తప్పుబడుతున్నారా?
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనను ప్రవాస భారతీయులు కూడా అసహ్యించుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన శ్రీకాంత్ రెడ్డి శనివారం హైదారబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ఏపీలో ముఖ్యమంత్రి రాచరిక పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై అమెరికాలోని ఉన్న తెలుగువారిలో ఆందోళన నెలకొందని చెప్పారు. ఇక నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి వ్యవహారంపై కూడా మండిపడ్డారు.
రాజధాని వ్యవహారాన్ని చంద్రబాబు కుటుంబ వ్యవహారంలా నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఓ న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శించారు. గొప్పలు చెప్పడం తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇప్పటివరకు చంద్రబాబు చేసిందేమీలేదని అన్నారు.

టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'పై ప్రవాస భారతీయులు సైతం తప్పుబడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి డబ్బుతో కొనుగోలు చేయడంప తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు అవినీతిని, ఓటుకు నోటు కేసు గురించి అమెరికాలో సైతం చర్చించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
గడచిన ఎన్నికల్లో తెలుగు దేశం మెనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హామీల అమలుపై నిలదీసిన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి
ప్రత్యేక హోదాతో సహా అన్నింటినీ ఢిల్లీలో చంద్రబాబు తాకట్టు పెట్టారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications