'బ్రెగ్జిట్ మాదిరి సీమకు రెఫరెండం': 'ఇక త్యాగాలు చేసే ఓపిక సీమ వాసులకు లేదు'
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ మరో ఉద్యమానికి ఊతమిస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా ఆరోపించారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన వీరు టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను, రాజధానిని రాయలసీమ నుంచి తరలించుకుపోయారని విమర్శించారు. ప్రస్తుతం తరలిస్తున్న సచివాలయ ఉద్యోగుల్లో రాయలసీమ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగుల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చేపట్టే కొత్త నియామకాల్లో రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. రాయలసీమ వాసులకు ఇదే విధంగా అన్యాయం చేసుకుంటూ పోతే కొత్త ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక త్యాగాలు చేసే ఓపిక రాయలసీమ వాసులకు లేదని ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బ్రెగ్జిట్ మాదిరిగా సీమకు రెఫరెండం
బ్రెగ్జిట్ మాదిరిగా రాయలసీమకు రెఫరెండం పెట్టాలని రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications