ఉపాధి హామీ పథకం: జగన్ వాకౌట్, అవగాహన లేదన్న మంత్రి మృణాళిని
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ జగన్ ఈ అంశంపై మాట్లాడారు.
పేదల కడుపు నింపే ఉపాధి హామి పథకాన్ని నీరుగాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్‌ఆర్‌ఈజీఎఫ్ ఫండ్స్‌తో గ్రామాల్లో రోడ్లు వేస్తాననడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఉపాధి హామ పథకం తీరుపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.
అనంతరం దీనిపై మంత్రి మృణాళిని స్పందిస్తూ ఉపాధి హామీ నిధులపై జగన్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఉపాధి హామీలో 60 శాతం నిధులను కూలీలకు వేతనాలు అందజేస్తున్నామని, పనిముట్లకు ఉపయోగించే 40 నిధులను శాతం మాత్రమే రోడ్ల కోసం వినియోగిస్తున్నామని వివరించారు.

ఉపాధీ హామీ పథకంపై వైయస్ జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జగన్‌పై మంత్రి మృణాళిని మండిపడ్డారు. అనంతరం వైపీసీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కుప్పం బ్రాంచి కెనాల్ ప్రాజెక్టుపై మాట్లాడారు. ప్రాజెక్టుల్లో అంచనాలను విచ్చలవిడిగా పెంచేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం నాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై ప్రశ్న వేశారు. రూ. 10 కోట్ల అంచనాలతో చేపట్టాల్సిన పనులను రూ. 150 కోట్లకు పెంచారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతి అంచనాలను ఐదింతలు పెంచారని మండిపడ్డారు.
రూ. 45 కోట్ల పనులను రూ. 180 కోట్లకు ఇచ్చారని, అది కూడా కాంట్రాక్టరుకు ఎలాంటి అనుభవం లేకపోయినా, కేవలం రాజకీయ ఒత్తిడితో నామినేషన్ మీద ఈ పనులు అప్పగించారని ఆయన చెప్పారు. 150 కోట్లతో పూర్తి చేయాల్సిన కుప్పం బ్రాంచి కెనాల్ ప్రాజెక్టుకు సింగిల్ టెండర్‌కే ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయం తెలుసో, తెలియదో గానీ.. మొత్తం అన్నింటి వివరాలు తెప్పించుకుంటే ఈ అంశంలో వేలకోట్ల అవినీతి బయటకు వస్తుందని చెప్పారు. ఈ ప్రశ్న పూర్తి కాకుండానే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమాధానమిచ్చారు.
కుప్పం బ్రాంచి కెనాల్ ప్రాజెక్టుపై మాట్లాడాల్సివచ్చినప్పుడు సింగిల్ సప్లిమెంటరీ అవకాశం అయినా శ్రీకాంత్‌రెడ్డికి ఇవ్వాలి కదా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు తమ పార్టీ సభ్యులేనని, వాళ్లకు కూడా ఇంకా అవకాశం రాలేదని జగన్ చెప్పారు. అయినప్పటికీ, స్పీకర్ మాత్రం తదుపరి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని మంత్రి దేవినేనికి సూచించారు.












Click it and Unblock the Notifications