వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్ .. కొనసాగుతున్న కరోనా బీభత్సం
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఏపీ వాసుల్లో టెన్షన్ నెలకొంది. కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 35,732 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4,157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 9,37 ,049 కరోనా కేసులు నమోదయ్యాయి.

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్
ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి సోకిన తర్వాత కూడా ఎమ్మెల్యే శ్రీదేవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో శ్రీదేవిని ఆసుపత్రిలో చేర్పించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎం నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 18 మరణాలు
గత 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి కారణంగా నెల్లూరులో నలుగురు చనిపోగా, కృష్ణా, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. విశాఖలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి ,అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం రాష్ట్రంలో 18 కరోనా మరణాలు సంభవించాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 7339 కి చేరుకుంది .

ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1606 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుండి బయట పడిన వారి సంఖ్య 9,01, 327 చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రతి 1,55,34,460 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది.
గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు నమోదు కాగా , పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 60 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలివే
ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లోనూ వందకు పైగా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే అనంతపురం జిల్లాలో 297 కేసులు, చిత్తూరు జిల్లాలో 517 ,తూర్పుగోదావరి జిల్లాలో 617, గుంటూరు జిల్లాలో 434, వైయస్సార్ కడప జిల్లాలో 112, కృష్ణాజిల్లాలో 135, కర్నూలు జిల్లాలో 386 , నెల్లూరు జిల్లాలో 276, ప్రకాశం జిల్లాలో 230 , శ్రీకాకుళం జిల్లాలో 522, విశాఖ పట్నం జిల్లాలో 417, విజయనగరం జిల్లాలో 154, పశ్చిమగోదావరి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications