వెల్లంపల్లి వర్సస్ ఉదయభాను : వైసీపీ ఎమ్మెల్యేల దూషణలు - సవాళ్లు..!!
ఇద్దరూ అధికార పార్టీ నేతలే. ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు..సవాళ్ల వరకు వెళ్లింది. వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్.. సామినేని ఉదయభాను మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చోటు చసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత.. దమ్ముంటే నా నియోజకవర్గంలో అడుగు పెట్టు అంటూ పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. పార్టీలు మారటం..నున్వు పోటుగాడివా అంటూ ఇలా.. ఇద్దరి మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయిలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ విజయవాడ కేంద్రంగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వైసీపీ అధినాయత్వం సీరియస్ గా తీసుకొనే వరకూ వెళ్లింది.

వైసీపీ ఎమ్మెల్యేల దూషణలు
విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాల్గొన్నారు. భవకుమార్ తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేసారు. ఇందులో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్న సమయంలో తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ ను తనకు చెప్పకుండా సీఎం వద్దకు తీసుకెళ్లటం పైన ఉదయభానును మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. దీనికి స్పందించిన సామినేని తనకు కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి శ్రీనివాస్ తో సంబంధాలు ఉన్నాయని తీసుకెళ్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. తన నియోజకవర్గంలో సామినేని జోక్యం చేసుకోవటంపై వెల్లంపల్లి నలదీసారు. విజయవాడ నీ సొత్తా..నీకేమైనా రాసిచ్చారా అంటూ సామినేని ఆగ్రహంతో వెల్లంపల్లిని నిలదీసారు.

నీ లాగా పార్టీలు మారలేదంటూ - దమ్మంటే అడుగు పెట్టు
వాగ్యుద్దంలో భాగంగా నా నాయోజకవర్గంలో నీవు రాజకీయాలు చేస్తే నేను నీ నియోజకవర్గం జగ్గయ్యపేటలో వచ్చి రాజకీయాలు చేస్తానంటూ వెల్లంపల్లి హెచ్చరించారు. దీనికి స్పందనగా నీకు దమ్ముంటే జగ్గయ్య పేటలో అడుగు పెట్టు అంటూ ఉదయభాను సవాల్ చేసారు. పార్టీలో సీనియర్ నని..నీ లాగా మూడు పార్టీలు మారలేదని..ఊసరవెల్లివి నీవు.. నీరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే సమయంలో కొన్ని పరుష..అనుచిత పదాలతో ఇద్దరు నేతలు దఊసించుకున్నారు. ఒకరినొకరు తోసుకొనే పరిస్థితి ఏర్పడింది. దేవినేని అవినాశ్ జోక్యం చేసుకొని ఇద్దరికి సర్దిచెప్పే చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో..వెల్లంపల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత జరిగిన వేడుకల్లో అవినాశ్, ఉదయభాను మాత్రమే కనిపించారు.

గొడవకు అసలు కారణం
2014లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా ఆకుల శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో వెల్లంపల్లి బీజేపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంత కాలంగా ఆకుల శ్రీనివాస్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన నియోజకవర్గంలోని అంశాలను సీఎంకు వివరించేందుకు ఉదయభాను సీఎం వద్దకు వెళ్లారు. అదే సమయం లో అక్కడా ఆకుల శ్రీనివాస్ ఎదురయ్యారు. ఈ నెల 28న తన కుమార్తె వివాహమని..ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చానని వివరించారు. దీంతో..ఇద్దరు కలిసి సీఎం వద్దకు వెళ్లారు. తన నియోజకవర్గం నుంచి తన పైన పోటీ చేసిన వ్యక్తిని సీఎం వద్దకు సామినేని తీసుకెళ్లటంతో వెల్లంపల్లి ఆగ్రహించారు. ఇదే అంశాన్ని ప్రశ్నించటంతో మొదలైన వాగ్యుద్దం తీవ్ర స్థాయికి చేరింది.