ఖర్గేను అందుకే కలిశా- వైసీపీ ఎంపీ మేడా క్లారిటీ..! ఉపరాష్ట్రపతికి ఓటుపైనా..!
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి భేటీ కావడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఓవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్న వేళ మేడా రఘునాథ్ రెడ్డి కలవడంతో ఇండియా కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి ఆయన ఓటు వేయబోతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మేడా ఖర్గేతో భేటీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుపై స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేతో గత 35 సంవత్సరాలుగా ఉన్న పరిచయం నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనను కలిసినట్లు వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు రాజకీయ వక్రీకరణలను చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో ఓ వీడియో విడుదల చేశారు.

వ్యక్తిగత సంబంధాలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ, అసంబద్ద కథనాలను ప్రసారం చేయడం తగదని మీడియా వర్గాలకు ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంటే తన పయనం ఉంటుందని మేడా తెలిపారు. పార్టీ అధినేతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అలాగే వైయస్ జగన్ సైతం తన పట్ల అదే విశ్వసనీయతతో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. పార్టీలోని మొత్తం ఎంపీలు వైయస్ జగన్ వెంటే నడుస్తున్నారని, రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికలో సైతం పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే అందరికీ శిరోధార్యమని తెలిపారు. దీనిలో మరో ఆలోచనకు తావులేదన్నారు.

వైయస్ జగన్ ను మరోసారి సీఎంగా చేసుకోవాలనే కృతనిశ్చయంతో పార్టీ ఎంపీలు పనిచేస్తున్నారని మేడా రఘునాథ రెడ్డి చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వ విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారరు. మల్లికార్జున్ ఖర్గేను కలిసిన తరువాత తనపై వస్తున్న ఊహాత్మక కథనాల నేపథ్యంలో స్పష్టత ఇచ్చేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మేడా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ఊహాగానాలకు తెరపడినట్లయింది.












Click it and Unblock the Notifications