కేంద్రానికి వైసీపీ ఎంపీ హెచ్చరిక..! కాంగ్రెస్ పేరు చెప్పి మరీ..
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలతో వైసీపీ, బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలు బలహీనమైనట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ-బీజేపీ మధ్య పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఏపీకి వచ్చిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. దీంతో వైసీపీ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. కేంద్రం ఏపీకి చేసిందేమీ లేదంటూ ఎదురుదాడి చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ ఒకరు కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆయన ఆరోపించారు. పేరుకు బీసీ ప్రధాన మంత్రిని చేశారని చెప్పుకుంటున్న బీజేపీ.. ఇతర పార్టీలు మద్దతిస్తున్నా తమ వైఖరి మార్చుకోవడం లేదన్నారు. బీసీల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆర్.కృష్ణయ్య గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జనాభాపరంగా రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ ఎంపీ కృష్ణయ్య కోరారు. దేశంలోని 75కోట్ల మంది బీసీల అభివృద్ధికి కేంద్రం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఈసారి బడ్జెట్లో రెండు లక్షల కోట్లు బీసీలకు కేటాయించకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళనలు చేస్తామని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. అలాగే పదవుల విషయంలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.
75 ఏళ్ళుగా భారతదేశంలో అన్ని పదవులు, సంక్షేమ పథకాలు మీరే అనుభవించారని, బీసీలకు మాత్రం ఏమీ దక్కడం లేదని వైసీపీ ఎంపీ కృష్ణయ్య కేంద్రాన్ని విమర్శించారు. దీనిపై బీసీ సంఘాలన్నీ ఇప్పటికైనా కలిసికట్టుగా ఉద్యమించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు తాను అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తానని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరి మార్చుకోవాలని కృష్ణయ్య కోరారు.












Click it and Unblock the Notifications